సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మరో మూడురోజల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీవర్షానికి హైదరాబాద్మహానగరం తడిసిముద్దయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, బేగంపేట, ఎంజే మార్కెట్, నాంపల్లి, ఆబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ, ఎల్బీ నగర్, బోయిన్‌పల్లి, తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా సూరారంలో తెలుగుతల్లి నగర్‌లో ఇళ్లలోకి నీరు చేరింది.
– వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఎడతెరపి లేకుండా భారీవర్షం కురిసింది. దారుర్- వికారాబాద్ ప్రధాన రోడ్డు మార్గంలో బాచారం వద్ద రోడ్డు పైనుంచి వాగు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
– మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో వానలు దంచి కొడుతున్నాయి. బుధవారం రాత్రి 7.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు దూకుతున్నాయి. రామోజీపల్లి చెరువు అలుగు పారుతోంది. నిజాంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి దుంకుతూ అలుగుపారుతున్నాయి.
– నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల మండలాల్లో శనివారం తెల్లవారుజామున భారీవర్షం కురిసింది. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. చంద్రసాగర్ ఎనిమిదేళ్ల తర్వాత అలుగు పారింది. 2013లో ఇలాంటి భారీ వర్షాలు కురిశాయి. అలాగే జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది.
– ఏకధాటిగా కురుస్తున్న భారీవర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా అతలాకుతలమైంది. పల్లెలు, పట్టణాలో లోతట్టు కాలనీల్లోని నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పంట పొలాలు, మైదానాలు జలమయంగా మారి చెరువులను తలపించాయి. వర్షాల తాకిడితో పలుచోట్ల చెరువులకు పొర్లిపోతున్నాయి.