Breaking News

థియేటర్లు ఓపెన్ అవుతున్నయ్.. కానీ!

థియేటర్లు ఓపెన్ అవుతున్నయ్.. కానీ!

అక్టోబర్​ 15వ తేదీ నుంచి థియేట‌ర్లు, మ‌ల్టీఫ్లెక్స్​లు తెర‌వ‌డానికి కేంద్రం అనుమ‌తులు ఇచ్చేసింది. కాకపోతే అందుకు కొన్ని మార్గద‌ర్శకాలు పాటించాల్సి ఉందట. కేవ‌లం 50 శాతం సిట్టింగ్ కే అనుమ‌తి. ఆటఆట‌కు మ‌ధ్య శానిటైజేష‌న్ త‌ప్పనిస‌రి. టికెట్లన్నీ వీలైనంత వ‌ర‌కూ ఆన్ లైన్‌లోనే అమ్మాలి. ఎప్పటి నుంచో థియేట‌ర్ల పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తున్న ద‌ర్శక నిర్మాత‌ల‌కు ఇది శుభ‌వార్తే. అక్టోబ‌రు 15 నుంచి థియేట‌ర్లు ఓపెన్ కావడం సంతోష‌క‌ర‌మైన విష‌య‌మే. కానీ.. అప్పటికి సినిమాలు రెడీగా ఉన్నాయా? త‌మ సినిమాలను విడుద‌ల చేసుకోవ‌డానికి నిర్మాత‌లు సిద్ధమేనా? అన్నదే ప్రధాన ప్రశ్న. 50 శాతం ఆక్యుపెన్సీ అంటే స‌గం వ‌సూళ్లను వ‌దులుకోవ‌డ‌మే అవుతుంది. ప్రతి సినిమా.. ప్రతి షోకు హౌస్‌ఫుల్ కాదు. మొదటి రెండు రోజుల్లోనైనా హౌస్ ఫుల్స్ ఆశిస్తాడు నిర్మాత‌. కానీ ఇప్పుడు స‌గం థియేట‌ర్లు నిండుతాయంటే.. విడుద‌ల చేయ‌డానికి ధైర్యం చేయ‌గల‌డా? పైగా థియేట‌ర్ల నిర్వహ‌ణ ఇప్పుడు అంత తేలికైన విష‌యం కాదు. ఆటఆట‌కు మ‌ధ్య శానిటైజేష‌న్ చేయ‌డం, ప‌రిశుభ్రత పాటించ‌డం కూడా ఖ‌ర్చుతో కూడిన ప‌నులు. మ‌ల్టీప్లెక్స్ వ‌ర‌కూ ఫ‌ర్వాలేదు. బీ, సీ సెంట‌ర్లలో టికెట్లను ఇంకా కౌంట‌ర్ల ద‌గ్గరే అమ్ముతున్నారు.

ఆన్ లైన్ సౌక‌ర్యం లేని థియేట‌ర్లు ఎన్నో ఉన్నాయి. పెద్ద సినిమాల‌కు తొలి మూడు రోజుల వ‌సూళ్లే కీల‌కం. ఓ స్టార్ హీరో సినిమా తొలి మూడు రోజుల్లో రూ.20కోట్లు వ‌సూలు చేయ‌గ‌ల‌దనుకుంటే, ఇప్పుడు అది రూ.10 కోట్లకు ప‌డిపోతుంది. ఈ న‌ష్టానికి నిర్మాత సిద్ధప‌డాల్సివ‌స్తుంది మరి. అలాగ‌ని టికెట్ల రేట్లు పెంచే సాహ‌సం ఎవ‌రూ చేయ‌క‌పోవచ్చు. ఎందుకంటే ఇది క‌రోనా స‌మ‌యం. జీతాలు త‌గ్గి, ఖ‌ర్చులు పెరిగి మిడిల్​క్లాస్​పీపుల్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో టికెట్ రేట్లు పెంచితే మొద‌టికే మోసం వ‌స్తుంది. పెద్ద సినిమాల వ‌ర‌కూ.. కాస్త ధైర్యంగానే ఉండొచ్చేమో. చిన్న సినిమాలకు మ‌రింత న‌ష్టం వాటిల్లుతుంది. మౌత్ పబ్లిసిటీ ద్వారానే జ‌నాలు వచ్చే అవకాశం ఉంది. స‌గం సిట్టింగే క‌దా! అని అద్దెలు త‌గ్గవు, నిర్వహ‌ణ వ్యయ‌ం త‌గ్గదు. ఇవ‌న్నీ స‌మ‌స్యలే. అయినా.. అక్టోబ‌ర్​15 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధమ‌య్యే చిత్రాలు మ‌హా అయితే 10 ఉంటాయ‌ని టాలీవుడ్ జ‌నాల మాట‌. వాటిలో కొన్ని ప్రస్తుతం ఓటీటీల‌తో బేరాలు చేసుకుంటున్నాయి. మ‌రికొన్ని ద‌స‌రా, దీపావ‌ళి కోసం ఎదురు చూస్తున్నాయి. థియేట‌ర్లు ఓపెన్ అయినా జనం సినిమాలు చూసేందుకు మాత్రం ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదేమో..!