Breaking News

త్వరలోనే వంశధార పూర్తి

త్వరలోనే వంశధార పూర్తి

సారథి న్యూస్​, పోలాకి(శ్రీకాకుళం): వంశధార ప్రాజెక్టు త్వరలోనే పూర్తిచేస్తామని, అన్నదాతలను అన్నిరకాలుగా ఆదుకుంటామని, శ్రీకాకుళం జిల్లా స్థితిగతులు, రూపురేఖలను సమూలంగా మార్చుతామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తి కావడంతో ప్రజల కోసం నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా గురువారం 7వ రోజు సంఘీభావ యాత్రలో పాల్గొన్నారు. పోలాకి మండల కేంద్రంలో తహసీల్దార్​ కార్యాలయం నుంచి ఎంపీడీవో ఆఫీసు వరకు చేపట్టిన యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి మూడో స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. అమ్మఒడి, సచివాలయ వ్యవస్థ, నాడు.. నేడు, పింఛన్​ పథకం, బీసీ కార్పొరేషన్లు, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు పేదల తలరాతలను మార్చాయని అన్నారు. ఎక్కడ పరిశ్రమలను ఏర్పాటుచేసినా స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని వివరించారు. నూతన పారిశ్రామిక విధానాన్ని ఇప్పటికే ఆమోదించడంతో నిరుద్యోగ సమస్య చాలావరకు తీరిపోతుందని భావిస్తున్నామని చెప్పారు. అంతకుముందు పోలాకి గ్రామ సచివాలయం ఎదుట ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.