- తుంగభద్ర నదిలో విస్తృతంగా గాలింపు
- కలుగొట్ల సమీపంలో వాగులో గల్లంతు
- పర్యవేక్షిస్తున్న జోగుళాంబ గద్వాల ఎస్పీ
సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబ గద్వాల): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్ల సమీపంలో వాగులో మూడు రోజుల క్రితం కొట్టుకుపోయిన నాగసింధూరెడ్డి ఆచూకీ కోసం తుంగభద్ర నదిలో ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలతో గాలింపు చేపట్టారు. కలుగోట్ల వాగులో కొట్టుకుపోయిన స్థలం నుంచి తుంగభద్ర నది తీరం వరకు జేసీబీ వెహికిల్తో ముళ్లపొదలను తొలగిస్తూ అణువణువూ వెతుకుతున్నారు. సంఘటన స్థలాన్ని ఆదివారం మరోసారి జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పరిశీలించారు. సంఘటన స్థలం నుంచి నదీతీరం వరకు ఆయన పోలీస్ బృందంతో నడుచుకుంటూ వెళ్లి పరిసరాలను పరిశీలించారు. కర్నూలు నుంచి మరబొట్లను తెప్పించి సోమవారం ఉదయం నుంచి నదిలో గాలింపు చేపడతామన్నారు. తుంగభద్ర నదిలో నీరంతా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
కాగా, కడప జిల్లా స్వస్థలం పులివెందులకు చెందిన నాగసింధూరెడ్డి, భర్త శివకుమార్‌రెడ్డి, మరో వ్యక్తి జిలానీబాషాతో కలిసి కారులో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు పుల్లూర్ నుంచి కలుగొట్ల మీదుగా 44వ జాతీయ రహదారిపైకి చేరుకోవాలని బయలుదేరి వెళ్లారు. కలుగొట్ల సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో కారుతో సహా ముగ్గురూ కొట్టుకుపోయారు. శివకుమార్, జిలానీబాషా క్షేమంగా బయటపడ్డారు.