Breaking News

టీడీపీ నేతల అరెస్టులపై బాబు అంతర్మథనం

సారథి న్యూస్, అనంతపురం: టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదనీ, సంక్షోభంలో నుంచి అవకాశాలు వెతుక్కోవడం ఎలాగో తమకు బాగా తెలుసునని టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటారు. కానీ, పరిస్థితులు ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పార్టీ తరఫున సరిగ్గా వాయీస్‌ వినిపించే బలమైన నాయకుడు టీడీపీకి లేడన్నది నిర్వివాదాంశం. శుక్రవారం మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్‌తో టీడీపీ కొంత మేర ‘గలాటా’ చేయగలిగిందిగానీ.. రెండో రోజుకి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ‘వైఎస్‌ జగన్‌ బీసీలను వేధిస్తున్నారు’ అంటూ సోషల్‌ మీడియాలో అచ్చెన్న అరెస్ట్‌పై ప్రచారం చేసింది టీడీపీ. కానీ, అంతలోనే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత అరెస్ట్‌ జరిగింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడి అరెస్ట్‌తో టీడీపీ మరింత డిఫెన్స్‌లోకి వెళ్లిపోయింది.

‘వైఎస్‌ జగన్‌, రెడ్డి సామాజికవర్గాన్ని వేధిస్తున్నారు..’ అని టీడీపీ ఇప్పుడు నినదించే పరిస్థితి లేదు కదా.! ‘కక్ష పూరిత రాజకీయాలకు ఇదే నిదర్శనం’ అంటూ టీడీపీ నేతలు ఎంతగా గొంతు చించుకుంటున్నా.. మున్ముందు రాజకీయ పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయని అధికార వైఎస్సార్​సీపీ హెచ్చరికలు జారీచేస్తోంది. ‘అసలు టార్గెట్‌ చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌..’ అంటూ పలువురు మంత్రులు స్పష్టంగానే చెబుతున్నారంటే, రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జేసీ అరెస్ట్​తో మున్ముందు మరిన్ని అరెస్టులు తప్పేలా లేవు. ‘లెక్కలు తీయాల్సినవి చాలా ఉన్నాయ్‌.. దమ్ముంటే అరెస్ట్‌ చెయ్యమన్నారు కదా.. మా దమ్ము చూపిస్తున్నాం..’ అని మంత్రులే చెబుతుండడంతో సహజంగానే తెలుగు తమ్ముళ్లలో ఆందోళన తీవ్రమవుతోంది. కొందరు నేతలైతే, ‘ఎందుకొచ్చిన గొడవ.. పార్టీ మారిపోతే పోలా.?’ అనే ఆలోచన చేస్తున్నారట.

‘ఇప్పటికే పార్టీ మారిపోయి ఉంటే బాగుండేది..’ అంటూ సదరు టీడీపీ నేతలు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటుంటే, ఈ వ్యవహారం ఆనోటా ఈనోటా అధినేత వద్దకు చేరడంతో వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు నానాతంటాలు పడాల్సి వస్తోందట. ‘మేం అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీ తాట తీస్తాం..’ అంటూ చంద్రబాబు అండ్‌ టీమ్ గొంతు చించుకుంటున్నా, అవన్నీ తాటాకు చప్పుళ్లు మాత్రమేనని, చంద్రబాబు రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చేసిందనీ వైఎస్సార్​సీపీ నాయకులు చెబుతున్నారు.