కోరికల కోరలు చాచిన తాచుల చుట్టూ
నా గారాల పట్టి చప్పుడు ఆగిపోయేనా !
కత్తుల పదును వాంఛలున్న ఉన్మాదుల మధ్య
కుత్తుక ఆగి కొట్టుమిట్టాడేనా !
బలంతో విర్రవీగే బకాసురాల నడుమ
బలహీనమై నీ వెన్నుపూస విరిగేనా !
కామంతో మసిలిన ఆ కాల యముళ్లు
నీ కలలను కడతేర్చారా తల్లి !
నరరూప “మాన భక్షకులు”
నీ నాలుక తెగ్గోసారా చెల్లి !!
ఏ రాముడు దుష్ట సంహారం చేయలేదు,
క్షమించు..చీకటి సాక్షిగా నిప్పులో తోసేసాము !!
బచావో అన్న నీ కన్నవాళ్ళ కడుపు మంట
ఈ లోకం కడతెరేదాక రగులుతూనే ఉంటుంది !!
నీలా ఎందరో… నీవలే ఇంకెందరో..
కాపాడలేకున్నాము…ఈ కర్మభూమిలో !!
క్షమించకండి మమ్మల్ని… శపించండి
మా తరాలు చచ్చిన శవాలము,
వ్యవస్థను నిలదియ్యలేని నపుంసకులము !!
- రమేశ్ మిద్దె (మీరా) హైదరాబాద్, సెల్: 73824 40085