- వైభవంగా కోరమీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి
సారథి న్యూస్, హుస్నాబాద్: భక్తుల కొంగు బంగారమైన కొమురవెళ్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతల సాక్షిగా, వేలాది భక్తుల మధ్య వీరశైవ పండితుల మంత్రోచ్ఛరణ కొమురవెల్లి మల్లికార్జునస్వామి, కేతలమ్మ, బలిజ మేడలదేవిని వివాహమాడారు.
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
అంగరంగ వైభవంగా నిర్వహించే మల్లన్న కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారికి ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయ నిర్వాహకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలకగా మంత్రి మల్లారెడ్డి మల్లికార్జునస్వామి తరఫున మేడలమ్మ, కేతలమ్మకు రూ.1,01,016 విరాళం అందజేశారు.
భక్తజన సందోహంగా మల్లన్నక్షేత్రం
కొమురవెళ్లి మల్లన్న కల్యాణ మహాఘట్టాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు 64సీసీ కెమెరాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు దేవస్థాన పాలకమండలి సభ్యులు ప్రతి ఒక్కరికి మాస్కులు అందించారు. స్వామి వారి కల్యాణానికి సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, పలువురు ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.