సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా ఆంక్షలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. డీజిల్ ధరలు అమాంతం పెరుగడంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోతున్నది.దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న డీజిల్ ధరలు..సంస్థకు మోయలేని భారంగా మారాయి. ఓ వైపు ఆక్యుపెన్సీ లేక.. మరోవైపు పెట్రో భారం కలిసి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతోంది తెలంగాణ ఆర్టీసీ. కరోనా నిబంధనల వల్ల తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సగం సీట్లలోనే ప్రయాణికుల్ని అనుమతిస్తున్నారు. వైరస్ భయంతో ప్రజలు ఆ సగం సీట్లలోకూడా ఎక్కడం లేదు. మరోవైపు అడ్డూ-అదుపూ లేకుండా డీజిల్ ధర పెరిగిపోతోంది. దీంతో ఆర్టీసీ ఆర్థికంగా నష్టపోతోంది. కరోనా కారణంగా తెలంగాణ ఆర్టీసీ 50 శాతం సర్వీసులనే నడుపుతోంది. వాటిలో కూడా 40 శాతం ఆక్యుపెన్సీ మించడం లేదు. సాధారణంగా బస్సుల్లో ఎంత మంది ప్రయాణించినా డీజిల్ వినియోగంలో మాత్రం వ్యత్యాసం ఉండదు. ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి, వ్యయానికి మధ్య పొంతన కుదరడం లేదు. రోజుకు 12 కోట్ల రూపాయాలు రావాల్సి ఉండగా, ప్రస్తుతం 4 కోట్లకు పడిపోయింది. ఇప్పటికే ఆర్టీసీ అప్పులు, నష్టాలతో ఇబ్బందిపడుతోంది.
లాక్‌డౌన్ సమయంలో బస్సులు తిరగలేదు.. సడలింపులిచ్చిన తర్వాత డీజిల్ ధరను పెంచుకుంటూ పోతోంది ప్రభుత్వం. గడిచిన పన్నెండు రోజుల్లో లీటరుపై పది రూపాయల వరకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ ఏడాదికి 21 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. సగటున నెలకు 5 లక్షల 76 వేల లీటర్లను ఉపయోగిస్తోంది. ధరల పెరుగుదలతో పాటు వ్యాట్ కలిపి లీటరుకు సుమారు 27 శాతం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. కేవలం పన్నుల రూపంలో ఆర్టీసీ ఏటా 130 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తోంది. ఈ పరిస్థితుల్లో డీజిల్‌పై వసూలు చేస్తున్న పన్నును రాష్ట్ర ప్రభుత్వం మినహాయించినా సంస్థకు ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు. పెట్రోలు, డీజిల్‌ను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ప్రజారవాణా వ్యవస్థకు కొంత మేరకు ఉపశమనం లభిస్తుందని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులను టీఎస్-ఆర్టీసీ నడిపించడం లేదు. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా సిటీ బస్సులు తిరగడం లేదు. దీంతో కొంత డీజిల్ వాడకం తగ్గినా.. పెరిగిన డీజిల్ ధరలు ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో భారాన్ని తగ్గించుకునేందుకు బస్సు ఛార్జీలను పెంచే అవకాశాలున్నాయి.