- కర్నూలు జిల్లాలో భారీవర్షం
- నంద్యాల డివిజన్‌లో 93.88 మి.మీ. వర్షపాతం
- పొంగిన నదులు, వాగులు, వంకలు
- మునిగిన లోతట్టు ప్రాంతాలు, కాలనీలు
- ప్రజలను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో శనివారం భారీవర్షం కురిసింది. కుండపోత వాన కురవడంతో లోతట్టు, నది పరీవాహక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు వాన కురుస్తూనే ఉంది. జిల్లాలోని కుందూ, హంద్రీ, శ్యాంనదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీనికితోడు వాగు, వంకలు, చెరువు ఉప్పొంగడంతో కొన్నిచోట్ల పొలాల గట్లు తెగి ఇళ్లల్లోకి నీళ్లుచేరాయి. నంద్యాల పట్టణం, ఆత్మకూరు, మహానంది, మంత్రాయం, బండి ఆత్మకూరు, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిస్థాయిలో మునిగిపోగా కొన్నిప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు ప్రవహించాయి. నంద్యాల పట్టణంలోని ఎస్సీ కాలనీలో వరద ముంపులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక దళం సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నది పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో సుమారు 200 మంది చిక్కుకోగా వారిని కూడా రక్షించారు. జిల్లాలో దాదాపు 93.88 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కంట్రోల్ రూమ్స్ కేటాయింపు
కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ జి.వీరపాండియన్ ఉదయం కలెక్టరేట్‌లో రౌండ్ ది క్లాక్ ఫ్లడ్ రిలీఫ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ( 08518–277305)ను కేటాయించారు. అలాగే కర్నూలు ఆర్డీవో కార్యాయం కంట్రోల్ రూం(8333989011), నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూం (8333989013), ఆదోని ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూం(8333989012) కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటుచేసి ఫోన్ నంబర్లను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు.