Breaking News

కరోనా.. హైరానా

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,320 పాజిటివ్ కేసులుగా తేలాయి. ఇప్పటివరకు 165 మంది మృతిచెందారు. చికిత్స అనంతరం 1993 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2162కు చేరింది. జీహెచ్​ఎంసీ నుంచి అత్యధికంగా 143, మేడ్చల్​ జిల్లాలో 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్​ నగర్ 4, మెదక్​ 3, జగిత్యాల జిల్లాలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇదిలాఉండగా, హైదరాబాద్​ మహానగర మేయర్ కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. మేయర్​తో సహా ఆయన కుటుంబసభ్యులను హోంక్వారంటైన్​లో ఉంచారు. శుక్రవారం మేయర్​కు కరోనా పరీక్షలు చేయనున్నారు. కాగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆఫీసులో అందరికీ కరోనా టెస్టు​లు చేశారు. ఇందులో కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో మేయర్ డ్రైవర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో మేయర్ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన యధావిధిగా నగరంలో పర్యటిస్తున్నారు. గురువారం కూడా మల్కాజిగిరి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన వెంట మల్కాజిగిరిలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. స్థానిక కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఎల్బీనగర్ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, పలువురు టీఆర్​ఎస్​ నాయకులు ఉన్నారు.