సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజారోగ్య సేవలపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని మంత్రి కె.తారక రామారావు జిల్లా యంత్రాంగానికి సూచించారు. దీంతో పాటు సిరిసిల్ల పట్టణాన్ని అదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపైన కూడా మంత్రి సమీక్షించారు. సిరిసిల్లలో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పరుగులెత్తించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం జిల్లా అధికారులతో హైదరాబాద్లోని ప్రగతిభవన్లో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
వానాకాలంలో వర్షాలకు సిరిసిల్ల జిల్లాలోని అన్ని చెరువులు నిండాయని, మంచి పంటలు వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా రోగులకు అందుతున్న సేవలు, ఐసోలేషన్ సౌకర్యాలు, వైద్యచికిత్స విధానం తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా పేషెంట్లకు రెమ్ డెసివిర్, ప్లావిపిరావిర్ వంటి మందులు అందిస్తామని తెలిపారు. క్లస్టర్ ఆస్పత్రులపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, బండలింగంపల్లి పీపీహెచ్ సీల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. విలీన గ్రామాల్లో అభివృద్ధి వేగవంతమయ్యేలా చూడాలని సూచించారు. జిల్లాలో రైతు వేదికల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 154 గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రకృతివనాల పనులు జరుగుతున్న తీరును సమీక్షించారు. సమావేశంలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు.