న్యూఢిల్లీ : భారత్ లో కోవిడ్-19 ఉధృతి నానాటికీ విజృంభిస్తున్నది. దేశంలో శుక్రవారం రికార్డుస్థాయిలో 86,432 కరోనా కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 40 లక్షలు (40,23,179) దాటింది. దీంతో ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానానికి చేరింది. బ్రెజిల్ కు మన దేశానికి మధ్య వ్యత్యాసం 70 వేల కేసులు మాత్రమే. ఇక శుక్రవారం దేశవ్యాప్తంగా 1,089 మంది కరోనా బారినపడి మరణించగా.. ఇప్పటివరకు ఈ వైరస్ సోకి మృతి చెందినవారి సంఖ్య 69,561 కి చేరుకుంది. కాగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినా.. దేశంలో ఇప్పటివరకు 31 లక్షల మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లు ఉన్నాయి. శుక్రవారం నమోదైన కేసులలో 62 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే రావడం గమనార్హం. కరోనా కేసులు 30 లక్షల నుంచి 40 లక్షలు చేరుకోవడానికి 13 రోజుల సమయం పట్టింది. ఇక మొన్నటివరకూ కరోనా పాజిటివ్ లు తక్కువగా నమోదైన ఢిల్లీలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం అక్కడ 2,914 కేసులు నమోదయ్యాయి. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఆందోళన చెందవద్దని, పరీక్షలు పెంచడంతోనే కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆయన వివరించారు. దేశ రాజధానిలో పరిస్థితి తమ అదుపులోనే ఉందని ఆయన చెప్పారు. మరణాల రేటులో దేశ సగటు కన్నా ఢిల్లీ సగటు చాలా తక్కువగా ఉందని, కేసులు పెరిగినంత మాత్రాన భయపడవద్దని ఆయన అధికారులకు సూచించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 2.57 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 8.69 లక్షల మంది మరణించారు.
- September 5, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- DELHI
- INDIA
- NEWCASES
- కరోనా
- కేంద్రవైద్య ఆరోగ్యశాఖ
- కొత్తకేసులు
- ఢిల్లీ
- హైదరాబాద్
- Comments Off on కరోనా కేసులు @ 40 లక్షలు