సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి సామాన్యులను, సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. మూడురోజులుగా జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. కాగా, తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. కుటుంబసభ్యులకు ఇబ్బంది కలుగకూడదనే ఆస్పత్రిలో చేరానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తనను పరామర్శించేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని.. తాను విశ్రాంతి తీసుకుంటున్నందున ఎవరూ ఫోన్లు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.