సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాను ఎదుర్కొనేందుకు ఏకైక మందు ధైర్యమేనని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో హైదరాబాద్ పోలీసు ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించేలా నడుచుకోవాలని కోరారు.
‘అమెరికా లాంటి దేశం కరోనాతో విలవిల్లాడుతుంటే మనం సమన్వయంతో ఎదుర్కొంటున్నాం. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని శాసించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒకరికొకరు సాయంగా ఉండాలనే విషయాన్ని కరోనా గుర్తుచేసింది. వైద్యులు ఎంతో సాహసంతో చికిత్స చేస్తూ దేవుళ్ల స్థానంలో నిలిచారు. కరోనాతో కుటుంబసభ్యులు కూడా వద్దకు రాలేని పరిస్థితుల్లో వైద్యసిబ్బంది రోగులకు తోడుగా ఉండడం అభినందనీయం. విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు పోలీసులు అన్ని విధాలుగా తోడుగా ఉండటం అభినందనీయం. కరోనాకు భయపడి ఇతర రోగాలకు చికిత్స చేయించుకోకపోవడం సరైంది కాదు.’ అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
ప్లాస్మా దానం చేసేవారికోసం ప్రత్యేకంగా రూపొందించిన donateplasma.hcsc.in వెబ్‌సైట్‌ను మంత్రి ఈటల ప్రారంభించారు. ప్లాస్మా దానం చేయాలనుకునేవారు 94906 16780, 040-23434343 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పాల్గొన్నారు.