Breaking News

‘కరెంట్​ కిష్టన్న’ ఇకలేరు

‘కరెంట్​ కిష్టన్న’ ఇకలేరు

  • కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత
  • వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నేత

సారథి న్యూస్​, కల్వకుర్తి: నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు బరిలోకి దిగి రెండుసార్లు ఎన్నికయ్యారు. ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి పట్టణంలో రైతు కుటుంబంలో 1947లో జన్మించారు. వ్యవసాయం వృత్తి కలిగిన ఆయన రాజకీయాల్లో వార్డు సభ్యుడు, సర్పంచ్​ పదవి నుంచి రాష్ట్రస్థాయి రాజకీయ నేతగా ఎదిగిన నాయకుడు. 1977 ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. 1986లో టీడీపీ తరఫున కల్వకుర్తి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994లో స్వతంత్ర్య అభ్యర్థిగా శాసనసభ్యుడిగా గెలిచి, 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్​ కాంగ్రెస్ ​పార్టీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్​ఎస్​లో చేరారు. అనంతరం ఆయన కుమారుడు ఎడ్మ సత్యం కల్వకుర్తి మున్సిపల్​ చైర్మన్​గా ఎన్నికయ్యారు.
‘కరెంట్​ కిష్టన్న’గా గుర్తింపు
వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్​ సరఫరా చేయాలని, ట్రాన్స్​ఫార్మర్ల కెపాసిటీ పెంచాలని 2003లో నిరాహారదీక్ష చేపట్టారు. ఊరూరా రైతాంగం పెద్దఎత్తున తరలివచ్చింది. అప్పటి సీఎల్పీ లీడర్​గా ఉన్న డాక్టర్​ వైఎస్​ రాజశేఖర​రెడ్డి స్వయంగా కల్వకుర్తికి వచ్చి ఆయన చేపట్టిన దీక్షను విరమింపజేశారు. అప్పటి నుంచే ఆయనను రైతులు కరెంట్ కిష్టన్నగా పిలుచుకునేవారు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటిని తీసుకొచ్చేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. ఎడ్మ కిష్టారెడ్డి ఏ ఊరుకు వెళ్లినా తన వెంట నడిచిన కార్యకర్తలు, అభిమానులను స్వయంగా పేరు పెట్టి పిలవడం ఆయన ప్రత్యేకత. ఎంతోమంది తన శిష్యులకు రాజకీయ ఓనమాలు నేర్పించి ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చారు. అనామకులను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకున్నారు. రైతు నాయకుడిగా, ప్రజల పక్షపాతిగా పేరున్న ఎడ్మ కిష్టారెడ్డి మృతిపట్ల ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు శోకసంద్రంలో మునిగారు.