Breaking News

ఒకేరోజు 302 కేసులు


సారథి న్యూస్​, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 6,027కు చేరింది. గురువారం ముగ్గురు కరోనాతో మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 195గా నమోదైంది. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకున్న 3,301 మంది డిశ్చార్జ్​ అయ్యారు. మేడ్చల్​ జిల్లాలో 10, రంగారెడ్డి జిల్లాలో 17, జనగామ, వరంగల్​ అర్బన్​ జిల్లాల్లో మూడుచొప్పున కేసులు నమోదయ్యాయి.
ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ ఆఫీసులో కరోనా
ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ ఆఫీసులోని సర్కిల్-5 టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ శ్రీధర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. శ్రీధర్ పది రోజుల నుంచి అస్వస్థతతో బాధపడుతున్నట్లు సహోద్యోగులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఉన్నతస్థాయి అధికారులు కలుగజేసుకుని కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. విషయం తెలియగానే శ్రీధర్ తో పనిచేసే సిబ్బంది పక్కనే ఉన్న కంప్యూటర్ మహిళా ఆపరేటర్, చైన్ మెన్లు, ఏసీపీ రాణితో సహా ఉన్నత అధికారులు భయాందోళనకు గురయ్యారు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ ఆఫీసుకు వచ్చే కాంట్రాక్టర్లు, సమస్యలపై స్పందించే జర్నలిస్టులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ పారిశుధ్యం మౌలిక వసతుల కల్పన పనిగా విధులు నిర్వహించే వారికే కరోనా రావడం భయాందోళనలకు గురిచేస్తుందని వారు అభిప్రాయ పడుతున్నారు.