Breaking News

ఏపీ మూడు రాజధానులకు ఓకే

ఏపీ మూడు రాజధానులకు ఓకే

  • గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్​
  • సీఆర్డీఏ రద్దు బిల్లుకు పచ్చజెండా

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు ఇక అడుగులు పడినట్టే.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఓకే చెప్పారు. అలాగే, సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. దీన్ని ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఆమోదించింది. అయితే, మొదటిసారి ఏపీ మండలిలో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ ప్రకటించారు. అయితే, మూడు నెలలు గడిచిన తర్వాత మరోసారి అవే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో రెండోసారి ఆమోదించి మండలికి పంపింది. అక్కడ బిల్లులపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యంతరం తెలిపింది. కానీ, నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత బిల్లులను శాసనసభ కార్యాలయం గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపింది. ఈ బిల్లుల మీద గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత  రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది.

మూడు రాజధానులు ఇవే..
ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలన రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది. రాజధాని తరలింపునకు అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ చట్టాన్ని తీసుకొచ్చి రాజధాని అమరావతిలో ఏర్పాటుచేశారు కావునా చట్ట ప్రకారమే దాన్ని మార్చి రాజధానిని వికేంద్రీకరించామని ప్రభుత్వం చెప్పడానికి వీలవుతుంది.

సీఆర్డీఏ రద్దు
సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలపడంతో సీఎం వైఎస్​జగన్ మోహన్​రెడ్డి ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది. సీఆర్డీఏ పరిధిలో తాము చేయాలనుకున్న పనులకు పాతచట్టం అడ్డుగా ఉండిపోయింది. ఈ క్రమంలో సీఆర్డీఏ కూడా రద్దు కావడంతో ప్రభుత్వం ఆనుకున్న విధంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజధాని పరిధిలో బయటి వారికి ఇళ్లస్థలాల విషయంలో ప్రభుత్వానికి ఎదురైన ఇబ్బందులను ఇప్పుడు అధిగమించే అవకాశం ఉంది.

One thought on “ఏపీ మూడు రాజధానులకు ఓకే”

  1. Good decision by Ap cm and Government it’s is Good sign for ఆంధ్రప్రదేశ్ development as a normal citizen it is welcoming.

Comments are closed.