Breaking News

ఏపీలో ఎందుకీ పరిస్థితి

ఏపీలో ఎందుకీ పరిస్థితి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీలో రెండు మూడు రోజులుగా కరోనా కంగారు పెట్టిస్తోంది. వరుసగా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శని, ఆదివారాల్లోనే సుమారు తొమ్మిదివేల దాకా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు కూడా భారీగానే కేసులు నమోదవుతున్నాయి. కేవలం పాజిటివ్‌ కేసులు పెరగడమే కాదు.. మరణాలు కూడా రోజుకు 50కి పైనే ఉంటున్నాయి. దీంతో ఏపీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి దేశంలోనే అత్యధిక టెస్టులు ఇక్కడే జరుగుతున్నాయి. ఎక్కువ టెస్టులు జరుగుతున్నాయి కాబట్టి కేసుల సంఖ్య కూడా ఎక్కువ ఉండడం సహజమేనని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నారు. అయితే, వారు చెబుతున్న విషయం కొంతవరకు వాస్తవమేనని, అయితే, ప్రభుత్వం చెబుతున్నట్టు అందరికీ టెస్టులు చేసి చికిత్స అందించడంతో పాటు బాధితులందరినీ ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచితే కాంటాక్టు కేసులు తగ్గుతాయని, దీనివల్ల కేసుల సంఖ్య తగ్గాలి కాని.. ఎందుకు పెరుగుతున్నాయన్న ప్రశ్నలు ఏపీ వాసుల్లో వ్యక్తమవుతున్నాయి.


కారణం ఇదేనా?
ఇటీవల కాలంలో తెలంగాణలో కూడా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రధానంగా హైదరాబాద్‌ మహానగరంలో అది విలయతాండవం చేసింది. దీనిని అరికట్టేందుకు మళ్లీ హైదరాబాద్‌ మహానగరంలో లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి ఉందని, దీనిపై మంత్రివర్గంలో మాట్లాడి రెండు మూడు రోజుల్లో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ నెల ప్రారంభంలో చెప్పారు. గతంలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు ముందుగా హెచ్చరించకపోవడంతో హైదరాబాద్‌ నగరవాసులు, ఇక్కడకు వివిధ ఉపాధి కోసం వచ్చిన వారు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ఇప్పుడు కూడా అదే కష్టాలు ఎదురవుతాయని భావించిన వారు నగరాన్ని వదిలి వారి ప్రాంతాలకు వెళ్లారు. దాదాపుగా హైదరాబాద్‌లో ఉండే సగం మంది వారి సొంతూళ్లకు వెళ్లారు. నగరం నుంచి వెళ్లిన వారిలో దాదాపు 70శాతం మంది ఏపీకి చెందిన వారే. వారంతా ఇప్పుడు ఏపీలోని సొంత గ్రామాలకు చేరడంతో వారిద్వారా ఏమైనా ఇక్కడ కేసులు పెరుగుతున్నాయా.. అన్న అనుమానాలను ఏపీవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా శనివారం సుమారుగా నాలుగువేలు, ఆదివారం ఐదువేలకు పైగా కేసులు నమోదు కావడంతో ఏపీ వాసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడాన్ని గమనించిన ప్రధాని మోదీ ఆదివారం ఇద్దరు సీఎంలతో మాట్లాడారు. మోదీ ఫోన్‌ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి.. కరోనా కట్టడిని ఎలా చేస్తారోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.