Breaking News

ఏం సేస్తిరి.. ఏం సేస్తిరి!

సారథి న్యూస్​, హైదరాబాద్​: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు. ఆ తెలివితోనే ఎదుగుతున్నారు కొందరు. ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు విధిస్తే వాటినుంచి తప్పించుకొని ఎలా సంపాదించాలోననే ఆలోచనల కోసం వారి మెదడుకు పని పెడుతున్నారు. సర్కారు కంటే మెరుగ్గా ఆలోచన చేసి భారీగా సంపాదిస్తున్నారు. ఏపీలో దశలవారీగా మద్యనిషేధం విధించే క్రమంలో అక్కడి సీఎం మద్యం ధరలను భారీగా పెంచారు. దుకాణాల సంఖ్యను కూడా సగానికి సగం తగ్గించారు. దీంతో మద్యం కొనుగోలు చేయలేక వాటిని మానుతారన్న సీఎం భావన. కానీ, మద్యం అక్రమ రవాణాదారులు సీఎం ఆలోచనకన్నా పై ఎత్తులు వేశారు. వారు కొత్త దారులు తొక్కుతున్నారు.. అడ్డదారుల్లో వెళ్లినా పోలీసులు పట్టుకుంటున్నారని తెలిసి.. కాస్త అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఆటోల్లో సరుకు రవాణా రూపంలో పోలీసులను ఏమార్చాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోతున్నారు. లోపల పెద్ద మొత్తంలో మద్యాన్ని ఉంచి.. పైకి మాత్రం మిరపకాయలో.. వేరు శనక్కాయలో.. కూరగాయల వంటి వాటిని పెట్టి సరిహద్దులు దాటించాలనుకుంటున్నారు. అచ్చం ఇదే రీతిన ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు కొందరు ప్రబుద్ధులు.

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉండటం, మంచి బ్రాండ్లు ఏపీలో లేక పోవడాన్ని సొమ్ము చేసుకోవడానికి పలువురు ప్రయత్నిస్తూ పట్టుబడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి ఏపీ రాష్ట్రం తెనాలికి మద్యాన్ని తరలిస్తున్న ట్రాలీఆటోను అనంతగిరి మండలం దుర్గాపురం క్రాస్‌రోడ్డులో పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో మద్యం బాటిళ్లపై వేరుశనగ కాయలను కప్పి రూ.1.50లక్షల విలువైన మద్యాన్ని ఏపీ రాష్ట్రం తెనాలికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై రామాంజనేయులు తెలిపారు. ఇలా ప్రభుత్వాలు ఎన్ని విధానాలు చేపట్టినా కొందరు అక్రమార్కులు మాత్రం వాటన్నింటినీ దాటుకొని తమ వ్యాపారాన్ని జరుపుతూనే ఉన్నారు. వారి తెలివే వారికి ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.