Breaking News

ఎగుమతులు ఢమాల్​

ఎగుమతులు ఢమాల్​

సారథి న్యూస్​, హైదరాబాద్: కరోనాతో ఇండియాకు ఎగుమతి కష్టాలు మొదలయ్యాయా.. ఈ ఆర్థిక సంవత్సరం పరిస్థితి మరింత దిగజారనుందా.. నానాటికీ ఎగుమతులు క్షీణిస్తున్నాయా.. అవుననే సమాధానం వస్తుంది ఆర్థికరంగ నిపుణుల నుంచి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత ఎగుమతులు 10 శాతం తగ్గే అయ్యే అవకాశాలున్నాయని ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌ఐఈఓ) అంచనా వేసింది. కరోనా వైరస్‌ వల్ల గడిచిన ఏప్రిల్‌లో 60 శాతం, మే మాసంలో 36 శాతం ఎగుమతులు క్షీణించాయనీ.. దీంతో పోల్చితే ప్రస్తుత జూన్‌లో ఎగుమతులు 12 శాతం తగ్గి కొంత ఉపశమనం లభించిందని పేర్కొంది. అయితే ద్వితీయార్థంలో ఎగుమతులు కొంత పుంజుకోవచ్చని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ శరద్‌ కుమార్‌ సరఫ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఔషధ, మెడికల్, రోగనిరోధక యంత్రాలు, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్, వ్యవసాయ, అహార ప్రాసెస్, ప్లాస్టిక్, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్‌ రంగాల ఎగుమతులు పుంజుకోవడం ద్వారా మద్దతు లభించవచ్చన్నారు. కొన్ని నెలలుగా ఈ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుం దన్నారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చడానికి మర్సండైజ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఫ్రమ్‌ ఇండియా స్కీమ్‌ (ఎంఈఐఎస్‌) కింద మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. చైనా నుంచి వచ్చే దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు చేపట్టడం వల్ల ఆ దేశం నుంచి వచ్చే ముడి సరుకుల కొరతతో పరిశ్రమలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యకం చేశారు. భారత పరిశ్రమ రంగం దాదాపుగా చైనా, ఇతర దేశాల ముడి సరుకులపైనే ఆధారపడి ఉందన్నారు. భారత ఎగుమతి రంగంలో చైనా ముడి సరుకుల వాటా 50–60 శాతం వాటా ఉంటుందన్నారు. 2019–20లో భారత ఎగుమతులు 4.78 శాతం తగ్గి 314.31 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.