Breaking News

ఉప్పొంగిన పెద్దవాగు

ఉప్పొంగిన పెద్దవాగు

  • రాయిచూర్ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు
  • మానవపాడు– అమరవాయి మధ్య స్తంభించిన రవాణా

సారథి న్యూస్, మానవపాడు: భారీ వర్షాలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మానవపాడు –అమరావతి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇదే వాగు బొంకూరు శివారులో రాయిచూరు ప్రధాన రహదారిపై ఉప్పొంగి ప్రవహించడంతో రెండు రోజులుగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మార్గంలో రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే మండల పరిధిలోని నారాయణపురం, పెద్దఆముదాలపాడు, మానవపాడు, అమరవాయి, చెన్నిపాడు గోకులపాడు, బొంకూరు గ్రామాల మీద ఈ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో పరీవాహక ప్రాంతంలో ఉన్న పత్తి పంటలు ముంపునకు గురై కుళ్లిపోతున్నాయి.
60 కి.మీ. దూరప్రయాణం
అలంపూర్ చౌరస్తా నుంచి శాంతినగర్ మీదుగా వెళ్లే ప్రయాణికులు బొంకూరు సమీపంలో పెద్దవాగు పొంగి ప్రవహిస్తుండడంతో 60 కి.మీ. చుట్టూ తిరిగి గద్వాల మీదుగా దూర ప్రయాణం చేస్తున్నారు. కొంతమంది ప్రయాణికులకు ఎటు వెళ్లాలో దిక్కుతోచక సమీపంలోనే రోడ్డుపైనే గంటల తరబడి నిల్చుని ఎప్పుడు తగ్గుతుందనే అయోమయంలో పడ్డారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ప్రయాణికులు పడుతున్న కష్టాలను పత్రికల్లో ఎన్నోసార్లు చూపించినా అధికారులు మొద్దునిద్ర వీడడం లేదని పెదవివిరుస్తున్నారు.