సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్.. ఆర్థికశాఖపై సమీక్షించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాల చెల్లింపుపై సీఎం ఓ నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు ప్రకటించబోయే కొత్త పథకం, ఆర్థిక సౌలభ్యంపై అధికారులతో చర్చించే అవకాశం ఉన్నది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుతో రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడంపైనా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చలు జరపనున్నారు.
కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వాములుగా ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోత విధించక తప్పటం లేదని ప్రకటించిన సీఎం కేసీఆర్.. మూడు నెలలగా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ లో కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే. మూడు నెలల నుండి వారికి సగం జీతాలే ఇస్తున్నారు. దీంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి వారికి పూర్తిగా జీతాలు చెల్లించాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. లాక్ డౌన్ సడలింపుల అనంతరం రాష్ట్ర ఆదాయం ఎలా ఉంది? ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇస్తే ఎంత భారం పడుతుంది? రైతులకు మరో గుడ్ న్యూస్ అని ప్రకటించిన అంశంలో ఎన్ని నిధులు అవసరం పడతాయి? 57 సంవత్సరాలకే పెన్షన్ పథకం అమలు చేయగలమా? అన్న అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నారు.