Breaking News

ఈ చిత్రాలు థియేటర్ లోనే..

ఈ చిత్రాలు థియేటర్ లోనే..

కరోనా వల్ల పారిశ్రామిక రంగాలే కాదు సినిమా ఇండస్ట్రీ పురోగతి కూడా డైలమాలో పడింది. థియేటర్లు మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రిలీజ్​కు రెడీగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ సమయంలో సినీనిర్మాతలను ఆదుకునేందుకు ఒయాసిస్​లా కనిపించింది ఓటీటీ ఫ్లాట్​పామ్. అయితే ఇది చిన్న బడ్జెట్ సినిమాలకైతే ఓకే కానీ భారీ వ్యయంతో నిర్మితమయ్యే సినిమాలకు ఇది వర్కవుట్​అవుతుందని కొందరు నిర్మాతలు, హీరోలు కూడా అభిప్రాయపడుతున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక చిన్న బడ్జెట్ సినిమాకు హోర్డింగ్స్, యాడ్స్, థియేటర్ ఖర్చులు ఇలా ఆ సినిమా విడుదలకు చాలా ఖర్చవుతుంది. అదే ఓటీటీ అయితే ఈ ఖర్చులన్నీ కలిసొస్తాయి. అదీ కాక సినిమా అన్నివర్గాల ప్రేక్షకులు, ఇంటర్​నేషనల్ స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కానీ భారీ బడ్జెట్ చిత్రాలకు ఇది సరైన విధానం కాదు. స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల చేయడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కరోనా ఉధృతి నానాటికీ మించుతూ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ హీరోలైన అక్షయ్​కుమార్​, అజయ్ దేవగణ్ లాంటి అగ్ర కథానాయకులు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. వారు నటించిన చిత్రాలు డిజిటల్ ప్లాట్​ఫామ్​ ద్వారా ద్వారా విడుదల చేసేందుకు సిద్ధపడుతున్నారు.
కరోనాకు ముందు సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే ట్రెండ్ లేదు. మార్చిలో థియేటర్లు మూతపడడంతో ఓటీటీ ప్రత్యామ్నాయ వేదికగా మారింది. సినిమాల విడుదల కోసం దర్శక నిర్మాతలు డిజిటల్ ప్లాట్​ఫామ్​ను ఆశ్రయిచడం స్టార్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ‘గులాబో సితాబో’, కీర్తిసురేష్ ‘పెంగ్విన్’, జ్యోతిక ‘పొన్ మగల్ వందాల్’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. పరిమిత బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలు విడుదల ఆలస్యమయ్యే కొద్దీ నష్టపోతామని భావించిన నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమైంది. ఈ సినిమాలన్నీ వారికి లాభాలు తెచ్చిపెట్టడంతో మిగిలిన చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా ఈ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఓటీటీ బాటలో స్టార్ హీరోల చిత్రాలు
కరోనా వ్యాప్తి కారణంగా ఈనెల 31 వరకూ కూడా థియేటర్ల ఓపెనింగ్ కు ప్రభుత్వం నిరాకరిస్తోంది. దీంతో బాలీవుడ్ హీరో అజయ్, దేవగణ్ నటించిన ‘భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ , అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీబాంబ్’ చిత్రాలు మరో ఐదు బాలీవుడ్ చిత్రాలు ఓటీటీలో రిలీజ్అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. 1970 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ధైర్యసాహసాలను ప్రదర్శించిన ఐఏఎఫ్ స్క్వాడ్రన్ లీడర్ జీవితం ఆధారంగా అజయ్ దేవగణ్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’, ‘కాంచన’ ఆధారంగా అక్షయ్ కుమార్ ప్రధానపాత్రలో లారెన్స్ తెరకెక్కించిన ‘లక్ష్మీ బాంబ్’.. సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్యరాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో మహేస్​భట్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘సడక్ 2’.. అభిషేక్ బచ్చన్ కథానాయకుడిగా స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ది బిగ్ బుల్’ .. చిత్రాలు వీటితో విద్యుత్ జమ్వాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఖుదా హఫీస్’.. కునాల్ ఖేము ‘లూట్​కేస్’ సినిమాలు ఓటీటీ ప్లాట్​ఫామ్​హాట్ స్టార్​లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​చివరి సారిగా నటించిన ‘దిల్ బేచారా’ కూడా ఓటీటీ లో రిలీజ్ కానుంది.
తెలుగు చిత్రాలు..
టాలీవుడ్​లో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘వి’, అనుష్క ప్రధాన పాత్ర చేసిన ‘నిశ్శబ్దం’, రాజ్ తరుణ్ ‘ఓరేయ్ బుజ్జిగా’ చిత్రాల షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యి విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు మొగ్గుచూపడం లేదు. అయితే రీసెంట్​గా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నిర్మాతలు కూడా ఈ సినిమాల రిలీజ్కి ఓటీటీ అయితే బాగుంటుందేమో అన్న ఆలోచనలో ఉన్నారు.
మాకిష్టం లేదంటున్న వాళ్లు..
బాలీవుడ్​లో ఒక్కసారే ఇన్ని చిత్రాలు వరుసగా ఓటీటీ బాట పట్టనున్నాయని తెలిసిన ఎగ్జిబిటర్లు, మల్టీఫ్లెక్స్ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో ఓపెన్ అవుతాయన్న ఆశలను నిర్వీర్యం చేసే దిశగా ఓటీటీ వేదికలను ఎంచుకోవడం చాలా నిరుత్సాహపరుస్తోందని కార్నివాల్ సినిమాస్ ఓ ప్రకటనలో తెలిపింది. బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. అయితే అక్షయ్ కుమార్ నటించిన మరో చిత్రం ‘సూర్యంవంశీ’, రణవీర్ సింగ్ ‘83’ చిత్రాలను థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించడంతో ఎగ్జిబిటర్లకు కాస్త ఊరట కలిగించింది.

:: శ్రీ