సారథి న్యూస్, వరంగల్ : ‘కరోనా లాంటి విపత్తులను అనేకం మనం ఎదుర్కొన్నాం..దీనిని ఎదుర్కొనే సత్తా మనకు ఉంది.. ప్రజలెవ్వరూ భయపడవద్దు’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మంత్రులు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో సీఎస్సార్ గార్డెన్స్ లో కోవిడ్ 19 పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ మన రాష్ట్రాన్నే కాదు కరోనా మహమ్మారి యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దాని నియంత్రణ నేడు ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారింది. అయినా అనేక రకాల వ్యాధులను ఎదుర్కొన్న సత్తా మనకు ఉంది. ఇప్పుడు కూడా ధైర్యంగా ఈ సవాల్ ను ఎదుర్కొందాం. కరోన బాధితులకు మరింత మెరుగైన సేవలను అందిద్దామన్నారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. అయినా కొందరు అర్ధం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం కరోనా బాధితులకు అండగా ఉంటుందన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ కష్ట కాలాన్ని సవాల్ గా తీసుకుని పని చేయాల్సిన అవసరముందన్నారు. నిధులకు కొరత లేదని ఆసుపత్రిలోని సౌకర్యాల పెంపు కోసం అధికంగా ఖర్చు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారన్నారు.