జైపూర్: కాంగ్రెస్ పార్టీ తనపై కావాలనే ఆరోపణలు చేస్తోందని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ అన్నారు. కాంగ్రెస్ తనపై చేసిన ఆరోపణలు అన్నీ అబద్దం అని చెప్పారు. కేంద్ర మంత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాలు చేశారని, దానికి సంబంధించి ఆడియో టేప్‌లు కూడా బయటికొచ్చాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించిన నేపథ్యంలో షకావత్ వివరణ ఇచ్చారు. ఆ టేప్‌లో ఉన్న వాయిస్ తనది కాదని అన్నారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. పైలెట్ వర్గంలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి బేరాలు జరిపారని, దానికి సంబంధించి ఆడియో క్లిప్‌లు ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది. ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒకర్ని అరెస్టు చేశారని తెలుస్తోంది. కాగా.. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేలను అరెస్టు చేసేందుకు సచిన్ పైలెట్ ఎమ్మెల్యేలు ఉన్న శిబిరానికి వెళ్లినట్లు అధికారులు చెప్పారు.