సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి విద్యావ్యవస్థను అల్లకల్లోలం చేసింది. విద్యాసంస్థలు తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇప్పటికే అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా అదేవిధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే, అందరిలో ఉదయిస్తున్న ప్రశ్న ఒక్కటే. ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థులకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? అని.. వాస్తవానికి విద్యార్థి తరగతి గదిలో విన్న పాఠానికి, ఆన్లైన్లో విన్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. తరగతి గదిలో అయితే విద్యార్థుల దృష్టింతా టీచర్‌పైనే ఉంటుంది. పైగా విద్యార్థులు క్లాస్ వింటున్నారా? లేదా? అనే విషయం టీచర్‌కు తెలుస్తుంది. విద్యార్థులకు ఏమైనా సబ్జెక్టుపై అనుమానాలు ఉన్నా వెంటనే టీచర్‌ను అడిగి వాటిని నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల వల్ల ఇవేవీ నెరవేరే పరిస్థితి ఉండదు. టీచర్ పాఠం చెప్పుకుంటూ పోవడం తప్ప విద్యార్థిని గమనించే అవకాశం లేదు. పైగా విద్యార్థి క్లాసు వింటున్నాడా? లేదా? అన్నది కూడా పరిశీలించే పరిస్థితి ఉండదు. అయితే, ఈ విధానానికి టీచర్లు కూడా అలవాటు పడి ఉండాలి. కానీ, చాలా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఇలాంటి విద్యాబోధన లేకపోవడంతో టీచర్లకు కూడా ఇది కొత్తే. వారు కూడా శిక్షణ పొందాల్సిన అవసరం ఉంది.
ఆన్లైన్ క్లాసులు భారమే
అనేక దేశాల్లో ఆన్లైన్ తరగతుల ద్వారా డిగ్రీలు అందజేస్తున్నప్పటికీ మన దేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఆన్లైన్ శిక్షణ అందుబాటులో ఉంది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ విధానానికి కేంద్రం అనుమతిచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా? సద్వినియోగం చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ)కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పాఠశాల స్థాయిని అనుసరించి రోబోటిక్స్, బార్‌కోడింగ్, సెక్యూరిటీ మీద దృష్టి సారిస్తే ఆన్లైన్ విధానం ద్వారా చిన్నప్పటి నుంచే నైపుణ్యంతో కూడిన విద్య సజావుగా సాగేందుకు అవకాశం ఉంటుంది. అధునాతన కంప్యూటర్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయంతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. బోధకులకు తగిన శిక్షణ అవసరం. గూగుల్ క్లాస్రూమ్, బ్లాక్‌బోర్డు, వెబెక్స్, జూమ్, కొర్సెరా, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్రత్యామ్నాయ విధానాలపైనా ప్రణాళికలు రూపొందించుకోవాలి.
వీడియో, ఈ–బుక్స్, యానిమేషన్ నిపుణుల సలహాలను, సూచనలు తీసుకుంటే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మన దేశంలో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు విద్యను అభ్యసిస్తున్న వారు దాదాపు 25 కోట్ల మంది వరకు ఉన్నారు. వీరికి ఆన్లైన్లో విద్యాబోధన కొనసాగిస్తే రూ.15 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటి అనేది వేచి చూడాల్సిందే. ఇప్పటివరకు దేశంలో ఆన్లైన్ టీచింగ్ నిర్వహణకు 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు కొన్ని విద్యాసంస్థలు సిద్ధపడుతున్న పరిస్థితుల్లో ఈ మినహాయింపు లేదు.
సరైన ప్రమాణాలు పాటించకుంటే..
ఆన్లైన్ విద్యాబోధనలో సరైన ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించకపోతే విద్యార్థులు ఒత్తిడితో మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు వర్చువల్ రియల్టీ కళ్లజోళ్లు ఉపయోగించకపోతే కంటి సమస్యలు తలెత్తవచ్చు. పరిశ్రమలు, కాలుష్య ప్రాంతాల్లో మైగ్రేన్, సైనస్ తదితర సమస్యలు తప్పవు. చిన్నమెదడుపై ప్రభావంతో రక్త ప్రసరణ వేగం తగ్గి ఆక్సిజన్ స్థాయి పడిపోయే ముప్పుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణ తరగతుల్లో విద్యార్థులంతా కలిసి మెలిసి చదువుతారు. కొరత సమయం ఆడుకుంటారు. ఆన్లైన్ క్లాసుల్లో ఆ పరిస్థితి ఉండదు. ఒకే గదిలో ఒంటరిగా కుంగిపోతారు. దీనికితోడు విద్యార్థులకు నడుంనొప్పి, ఇతర సమస్యలు తలెత్తవచ్చు అంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 నుంచి 12 గంటల్లోపు ఆరు తరగతులు నిర్వహిస్తున్నారు. ఐదు నిమిషాలు విరామం. ప్రతి రెండు క్లాసుల తరువాత 15 నిమిషాల విరామం ఇస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టెలీ స్కూల్ ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తే మంచిది అంటున్నారు.
పేదలు మరీ దూరం
ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు కరోనా ప్రభావంతో విద్యకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారు. హాస్టళ్లు తెరిచే అవకాశం లేదు. ఇప్పటి వరకూ మధ్యాహ్న భోజన వసతితో చదువుతున్న పేదోళ్ల బిడ్డలకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. హాస్టళ్లలో పౌష్టికాహారంతోపాటు సహచర విద్యార్థులతో కలసి మంచి వాతావరణంలో చదువుకునే వీరంతా ఇప్పుడు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమే
ఆన్లైన్ తరగతుల నిర్వహణ నేపథ్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం. వీరికి సాంకేతిక పరిజ్ఞానంపై తొలుత అవగాహన కల్పించాలి. పెన్‌డ్రైవ్, యూఎస్బీ, వైఫై, లేజర్ టెక్నాలజీ, ప్యాడ్, ఐ ప్యాడ్, యూ ట్యూబ్, స్మార్ట్‌ఫోన్, ప్రొజెక్టర్, వైర్లెస్ పరికరాల ప్రయోజనాలను వివరించాల్సి ఉంది. కేరళ లాంటి రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే నింపి వారికి ఆన్లైన్ బోధనలో శిక్షణ ఇవ్వకుంటే ఫలితం ఉండదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆన్లైన్ తరగతుల నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంతో సమన్వయం అవసరమంటున్నారు.