Breaking News

ఆగస్టు నాటికి పేదలకు డబుల్ ఇళ్లు

  • మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈ ఏడాది ఆగస్టు నాటికి హైదరాబాద్ నగరంలో 50వేల మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లను పంపిణీ చేస్తామని మున్సిపల్ ​శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. నగరంలో 80 శాతానికిపైగా నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన సైట్లలో పూర్తిచేసేందుకు ఇతర డిపార్ట్​మెంట్​లతో సమన్వయం చేసుకుని ముందుకుసాగాలని అధికారులకు సూచించారు.

నిర్మాణాలు పూర్తయిన చోట కరెంట్​, తాగునీటి సరఫరా పనులు కంప్లీట్​ చేయాలని ఆదేశించారు. పూర్తయిన సైట్లను వెంటనే జీహెచ్ఎంసీ హ్యాండ్​ ఓవర్​ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఎక్కువ భాగం హైదరాబాద్ నగరంలోనే నిర్మిస్తున్నామని గృహ నిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు సిటీలో పదివేల మందికి డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు అందించామని, త్వరలోనే ప్రాంతాల వారీగా లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, సీహెచ్ మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్​, హౌసింగ్​శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, మున్సిపల్​ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ పాల్గొన్నారు.