సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో మే చివరి దాకా రాత్రిపూట కర్ఫ్యూతో కొన్ని నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. జూన్ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశారు. మరోవైపు 8వ తేదీ నుంచి సినిమా థియేటర్లు, పాఠశాలలు మినహా షాపింగ్ మాల్స్, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో వ్యాపారాలు, క్రయ విక్రయాలు క్రమక్రమంగా ఊపందుకుంటాయని అందరూ భావించారు. తద్వారా పన్నుల రూపంలో ఖజానాకు రాబడి ప్రారంభమవుతుందనీ, ఈనెల చివరి నాటికి వేగం పుంజుకుంటుందని వాణిజ్య పన్నులశాఖ అంచనా వేసింది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిలను చెల్లించేందుకు వీలుగా వ్యాపారులకు జూన్ వరకూ సర్కార్ గడువు ఇవ్వడంతో పాటు సడలింపులు ప్రారంభమైన మే నెలలోనూ ఆదాయం నామమాత్రంగా రావడమే ఇందుకు కారణం. మార్చి చివరి వారంతో పాటు ఏప్రిల్‌లో వ్యాపార లావాదేవీలు లేకపోవడం, ఒకవేళ ఉన్నా వాటికి సంబంధించిన ఆడిటింగ్ జరక్కపోవడం తదితర కారణాల వల్ల పన్ను రాబడి తీవ్రంగా పడిపోయింది.
షాపింగ్ మాల్స్, హోటళ్లు తెరుచుకున్న లాభం లేదు
ఆన్‌లాక్ ప్రారంభమై.. వ్యాపార సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నప్పటికీ వినియోగదారులు వాటి వైపు వెళ్లేందుకు పెద్దగా సాహసించడం లేదు. హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులను భారీస్థాయిలో కుదించాయి. ఇప్పుడు పనిచేస్తున్న వారికి కూడా ఆయా సంస్థలు పూర్తిస్థాయిలో వేతనాలను చెల్లించడం లేదు. అత్యధిక కంపెనీలు 50 శాతం వేతనాలనే ఇస్తుండగా, కొన్ని మాత్రమే 60 నుంచి 70 శాతం వరకూ చెల్లిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాలు, పట్టణాల్లోని ప్రజలు తమ కనీస అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చి.. మిగతా వాటిని వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా వస్త్రాలు, నగలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర విలాసాలకు సంబంధించిన వస్తువుల దుకాణ సముదాయాలు, మాల్స్ అన్నీ అమ్మకాల్లేక వెలవెలబోతున్నా యి. అత్యధిక భాగం పన్నులొచ్చే ఇలాంటి వ్యాపార సంస్థల పరిస్థితి ఈ విధంగా ఉండడంతో వాణిజ్య పన్నులశాఖ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయం అంతంత మాత్రంగానే
వాస్తవానికి లాక్‌డౌన్ ముగిసిపోతే అనేక రకాల వెసులుబాట్లు లభిస్తాయి, తద్వారా సాధారణ జనజీవితం కొంతలో కొంత గాడిలో పడుతుందంటూ అందరూ భావించారు. కానీ రోజువారీ పనులు చేసుకుని పొట్టపోసుకునే కూలీలు, వ్యవసాయ కార్మికులు, వలస జీవులు, చిరుద్యోగులు, చిన్నాచితక వర్తకులకు ఇప్పటికీ పెద్దగా ఉపాధి దొరకడం లేదు. నగరాలు, పట్టణాల్లో నిర్మాణ, ఇతర రంగాల్లోని పనులు పుంజుకోవడం లేదు. మరోవైపు పెద్దస్థాయి ఉద్యోగులు, సంపన్నులు.. అత్యవసర పనులకు మినహా మిగతా సమయాల్లో గడప దాటడం లేదు. ఇదంతా రాష్ట్ర ఖజానాపై పెనుప్రభావం చూపుతోంది. ఫలితంగా అన్‌లాక్‌లోనూ ఆదాయం అంతంతమాత్రంగానే వస్తోంది. ఈ క్రమంలో జూన్‌లో సాధారణ ఖర్చుల కోసం పలు బాండ్లను విక్రయించడం ద్వారా సర్కారు దాదాపు రూ.రెండువేల కోట్లను సమకూర్చుకుంది.