కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ప్యాన్ ఇండియా సినిమా రానుంది. ‘విశ్వాసం’, ‘నేర్కొండ పార్వై’ సినిమాలతో లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సెస్ లు అందుకున్నాడు అజిత్. అదే ఏడాది డిసెంబర్‌లో తన కొత్త సినిమా ‘వలిమై’ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈ షూటింగ్ జరిగింది. లాక్ డౌన్‌కు ముందు 40శాతం వరకూ షూటింగ్ చేశారు. ‘పింక్’ రీమేక్ ‘నేర్కొండ పార్వై’ తర్వాత ‘ఖాకీ’ ఫేమ్ హెచ్.వినోద్ అజిత్ తో చేస్తున్న రెండో సినిమా ఇది. ఆ సినిమాను తీసిన బోనీకపూరే ‘వలిమై’కి కూడా నిర్మాత.
యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలగలిసిన ఈ థ్రిల్లర్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అజిత్ నటిస్తున్నాడు. హ్యూమా ఖురేషి హీరోయిన్. టాలీవుడ్ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. రియల్ లైఫ్‌లోనూ అజిత్‌కు బైక్ రేసింగ్‌పై ఉన్న ఇష్టంతో ఈ సినిమాలోని బైక్ రేసింగ్ సీన్స్ ఎంతో స్టైలిష్ గా చిత్రీకరించారట. తన కెరీర్‌లో ఇది 60వ సినిమా కావడంతో దీన్ని సమ్‌థింగ్ స్పెషల్‌గా మార్చాలనుకున్నారు మేకర్స్. హిందీతో పాటు నాలుగు దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా విడుదల చేయనున్నారు.