- విద్యావేత్తలు, విషయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుందాం
- విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అరికడదాం
- యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలు పాటించాలి
- ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యాసంవత్సరం
- విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
సారథి న్యూస్, హైదరాబాద్: విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. స్కూళ్లను ప్రారంభించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థలు, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యూజీసీ, ఏఐసీటీఈ తదితర సంస్థల మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును మెరుగుపరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో రంగంపై దృష్టిసారించి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యాప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై త్వరలోనే ఓ వర్క్ షాప్ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరిగింది
కేసీఆర్ కిట్స్ పథకం అమలు చేయడంతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం పేదలకు ఉపయోగిపడిందని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. ఓపీ పెరిగిందని, వైద్యరంగంలో దోపిడీ ఆగిందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని, దోపిడీ ఆగిపోతుందని సీఎం చెప్పారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
–విద్యావ్యవస్థ పవిత్రతను కాపాడే ఉద్దేశంతో యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలి.
-ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యాసంవత్సరం ప్రారంభించాలి.
-విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుంది.
-రాష్ట్రంలో స్కూళ్లను ఎప్పుడు ప్రారంభించాలి, విద్యాబోధన ఎలా జరగాలి? అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి, రాష్ట్రంలో ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే తుదినిర్ణయం తీసుకుంటుంది.
సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, ఉమర్ జలీల్, శ్రీహరి, శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.