Breaking News

శభాష్​ పోలీస్​

శభాష్​పోలీస్​

  • అనారోగ్యంతో వ్యక్తి మృతి
  • కరోనా అనుమానంతో ముందుకురాని బంధువులు, కుటుంబసభ్యులు
  • ఆటోలో డెడ్​బాడీని తీసుకెళ్లిన ఎస్సై మారుతి శంకర్‌
  • అంత్యక్రియలు జరిపి ఆదర్శంగా నిలిచిన పోలీసు అధికారి


సారథి న్యూస్, కర్నూలు, ప్యాపిలి: బంధాలు.. బంధుత్వాలు మరిచిన సమాజంలో మానవత్వం పరిమళించింది. మనుషులకు, మానవత్వానికి ఖాకీలు విలువ ఇవ్వరని భావించే వారంతా సోమవారం ఓ ఎస్సై చేసిన మంచి పనికి ఫిదా అయిపోయారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఓ వ్యక్తి మృతి చెందితే బంధువు, కుటుంబసభ్యులు కూడా దగ్గరికి రాని సమయంలో ప్యాపిలి ఎస్సై మారుతి శంకర్‌ వేసిన ముందడుగు ఎందరో హృదయాలను గెలుచుకుంది.

కర్నూలు జిల్లా ప్యాపిలి మండల కేంద్రంలో నాలుగు రోజుల క్రితం షాపులో పనిచేసే ఓ గుమాస్తాకు కరోనా పాజిటివ్​ వచ్చింది. ఆ కిరాణం షాపు యజమాని(42) కూడా ఆకస్మికంగా మృతిచెందాడు. కరోనాతో చనిపోయారనే అనుమానంతో బంధుమిత్రులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ప్యాపిలి ఎస్సై మారుతి శంకర్‌ స్వయంగా బ్యాటరీ ఆటోలో మృతదేహాన్ని ఊరుబయట శ్మశానవాటిక దగ్గరకు తీసుకెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. రాష్ట్రంలో పలుచోట్ల కరోనాతో మృతిచెందిన వారిని ఊరు బయట వదిలేయడం, కాల్వలో పడవేయడం వంటి ఘటనలు చూస్తున్నామని, అలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు పీపీఈ కిట్లు ధరించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే అంత్యక్రియలు నిర్వహించామని ఎస్సై మారుతి శంకర్‌ విలేకరులకు వెల్లడించారు. ప్రజలు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కు కట్టుకోవడంతో పాటు సామాజిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు.