Breaking News

రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

సారథి న్యూస్, మహబూబాబాద్: ప్రధాని మోడీ పాలనలో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వం మనువాద వ్యవస్థను పెంచి పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను నాశనం చేసేలా ఉన్నాయని ఆక్షేపించారు. రైతుల బతుకులు దుర్భరంగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మహబూబాబాద్​లోని ఆర్​టీ గార్డెన్ లో ‘భారతదేశం కమ్యూనిస్టు ఉద్యమం.. వందేళ్ల ప్రస్థానం’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయిలో సదస్సులో ఆయన మాట్లాడారు. 1920 అక్టోబర్ 17న రష్యాలో ఏడుగురు పొలిట్​బ్యూరో సభ్యులతో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. అందులో భారతదేశం నుంచి ఎంఎన్ రాయ్ పాల్గొని కమ్యూనిస్టు ఉద్యమాన్ని దిశానిర్దేశం చేశారని గుర్తుచేశారు. భారత రాజ్యాంగంలో ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వం.. అనే అంశాలను చేర్చడంలో కమ్యూనిస్టు పార్టీ కీలకంగా వ్యవహరించిందని అన్నారు. మహాత్మాగాంధీ చాతుర్వర్ణ వ్యవస్థను సమర్థించారని వివరించారు.

సదస్సుకు హాజరైన సీఎం నాయకులు, కార్యకర్తలు

నూతన వ్యవసాయ చట్టం కార్పొరేట్​ శక్తులు దోచుకునేలా ఉందని విమర్శించారు. గతంలో ఇవే విధానాలను అనుసరించిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోకముడిచారని గుర్తుచేశారు. దేశంలో కరోనా మూలంగా ప్రజలు అప్పుల పాలవుతుంటే అంబానీ ఆస్తులు రూ.రెండువేల కోట్లకు పెరిగాయని అన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలోకి పోతుందన్నారు. పేదలకు డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు, దళిత గిరిజనులకు భూపంపిణీలో సీఎం కేసీఆర్ ​పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పేదల భూములను సీఎం కేసీఆర్ ​లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జి.రాములు మాట్లాడుతూ.. ఎర్రజెండా కార్యకర్తలు మరింత చైతన్యవంతం కావాలని, అధ్యయనం చేయాలని, ప్రజలకు భవిష్యత్​ చూపాలని, భవిష్యత్ పోరాటాలకు బీజం వేయాలని కోరారు సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, అల్వాల వీరయ్య, సుర్ణపు సోమయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి జి.ప్రమీల పాల్గొన్నారు.