జైపూర్: రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఓ దశలో అధిష్ఠానం హామీతో సచిన్ పైలట్ మెత్తబడ్డాడని వార్తలు వినిపించాయి. అంతలోనే మళ్లీ కథ మొదటికొచ్చింది. తాను హైకమాండ్‌తో మాట్లాడలేదని.. తనకు ఎవరూ ఎటువంటి హామీలు ఇయ్యలేదని ఆయనే స్వయంగా చెప్పారు. సోమవారం ఉదయం తనవర్గ ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. తాజాగా జైపూర్‌లోని ఫెయిర్‌మోంట్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనాసభా పక్షసమావేశానికి సచిన్ పైలట్, ఆయన వర్గీయులు గైర్హాజరయ్యారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. గత రెండుమూడ్రోజులుగా నాటకీయపరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ యువనేత, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తనవర్గ ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లారు. తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయత్వం రంగంలోకి దిగింది. ప్రియాంక, రాహుల్, చిదంబరం మరికొందరు సీనియర్ నేతులు సచిన్ పైలట్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అధిష్ఠానం హామీలతో సచిన్ పైలట్ ఇంకా మెత్తబడ్డట్టు లేదు. ప్రస్తుతం సచిన్ ఏం ప్రకటన చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.