- వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి రాలేదు
- పేదలకు విద్యా , వైద్యం కోసం కృషిచేసిన
- ఈ ప్రాంతానికి ఎంతో చేయాల్సి ఉన్నది
- ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
సామాజిసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తనకు దిగవంత మంత్రి పుట్టపాగ మహేంద్రనాథే తనకు స్ఫూర్తి అని ఎమ్మెల్సీ కూచు కుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇంత మందికి సేవ చేస్తున్నప్పుడు.. స్థితిమంతమైన కుటుంబంలో పుట్టిన నేనేందుకు చేయకూడదో అనే భావనతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తన రాజకీయ అరంగేట్రను గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, చివరిదాకా వారితోనే ఉంటానని ప్రకటించారు. తన వారసుడిగా తన కుమారుడుకు వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోతున్నారని తెలిపారు. ఈనెల 12న పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన చాలా విషయాలను ‘సామాజికసారథి’తో పంచుకున్నారు.
ఓడిపోయినా నిరాశ చెందలేదు
1947 డిసెంబర్12న తూడుకుర్తిలో పుట్టిన. కూచు కుళ్ల రాంరెడ్డి, కొండమ్మ అమ్మానాన్నలు. నా గ్రామప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 1981లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీచేశాను. 1991 వరకు రెండు పర్యాయాలు కాంగ్రెస్ నుంచి సర్పంచ్, సమితి ప్రెసిడెంట్ గా పనిచేశరు. 2006లో తాడూరు మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా గంటా గుర్తుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. 1999-2014 వరకు 5 సార్లు ఓడిపోయాను. అయినా ఎక్కడా నిరాశ చెందలేదు. 1981 నుంచి 2018 వరకు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది.
పేదలకు విద్య, వైద్యమే లక్ష్యం
పేదలకు విద్య, వైద్యం అందించడమే నా లక్ష్యం. తాడూరులో 2.30 ఎకరాల పొలంలో సౌభాగ్యమ్మ పేరుతో జూనియర్ కాలేజీని ఏర్పాటుచేసి ఎంతో మంది పేద పిల్లలు చదువుకునే భాగ్యం కల్పించాను. తూడుకుర్తిలో ఒక్క ఎక్కర పొలము లో సొంత నిధులతో హైస్కూలు కట్టించాను. నాన్నగారు రామచంద్రారెడ్డి పేరు మీద కంటి ఆస్పత్రికి 10 ఎకరాలు ఇచ్చాం. సౌభాగ్య నగర్ కాలనీలో 3 ఎకరాల్లో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చాం. రాంరెడ్డితండాకు 4 ఎకరాలు దానం చేశాం. పేదింటి బిడ్డలు ఉన్నత చదువులు చదవేందుకు నాగర్ కర్నూల్ లో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయించాను.
వ్యాపారం కోసం రాజకీయాల్లోకి రాలేదు
నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి పదవులు చేపట్టిన ఎంతోమంది నాయకులు సంపాదనే పరమావధిగా పనిచేస్తున్నారు. కానీ నేను ఏనాడూ వ్యాపారం, అక్రమ సంపాదన ఆశించలేదు. పైగా ఆస్తులను పేదల కోసం దానం చేశాం. అదే నన్ను నిలబెట్టింది. ఈ ప్రాంతం, పాలమూరు జిల్లా సుభిక్షంగా ఉండాలన్నదే నా ఆశయం. దివంగత మాజీమంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. ఓ సాధారణ వ్యక్తి అసాధారణంగా పనిచేస్తున్నప్పుడు.. మనం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అలాంటి నేతలను చూసి పెరిగాం. వారి ఆశయాల కోసం పనిచేస్తా.