- నడిచే వెళ్తున్న 60 శాతం విద్యార్థులు
- బాలికలు మరో రెండు శాతం అధికం
- ప్రజారవాణాలో వెళ్లేది 12 శాతమే
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా.. బడికి వెళ్లే విద్యార్థులకు బాధలు తప్పడం లేదు. ఇప్పటికీ దేశంలో 60శాతానికి పైగా పిల్లలు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. ప్రజారవాణా సరిగా లేక.. గిరిజన గూడేలు వంటి చోట అసలు రవాణా సదుపాయాలే లేకపోవడంతో భవిష్యత్భారతమంతా బ్యాగుల భారం మోస్తూ కాలినడకనే స్కూళ్లకు నడక సాగిస్తున్నారని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్‌వో) తాజా నివేదికలో వెల్లడైంది.
పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 59.7 శాతం మంది పాఠశాల విద్యార్థులు నడిచే బడికి వెళ్తున్నారు. వీరిలో బాలురు(57.9 శాతం) కంటే బాలికలే (62 శాతం) ఎక్కువగా ఉన్నారు. ఈ గణాంకాలు పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. రూరల్ ఏరియాల్లో 61.4 శాతం మంది బాలురు, 66.5 శాతం మంది బాలికలు కాలినడకనే బడికి వెళ్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఇది 57.9శాతం, 62 శాతంగా ఉంది. ఇక ప్రజారవాణాను ఉపయోగించి స్కూళ్లకు వెళ్తున్న పిల్లలు 12.4 శాతం (గ్రామీణ ప్రాంతాల్లో 11.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో 15 శాతం) గా ఉన్నారు. ఇదిలాఉండగా.. ప్రజారవాణాను ఉపయోగించి బడికెళ్తున్న చిన్నారుల్లో 48.3 శాతం మంది మాత్రమే మినహాయింపు పొందుతున్నారని నివేదిక వెల్లడించింది.