సారథి న్యూస్, హైదరాబాద్: భానుడు ఇప్పటికే భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు సుర్రుమంటున్నాడు. వచ్చే ఐదురోజుల పాటు దేశవ్యాప్తంగా ఎండలు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఆదివారం మధ్యాహ్నం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు మండే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాజస్థాన్ లోని బికనేర్ లో వచ్చే ఐదురోజుల పాటు 47 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో కూడా 45, 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని అంటున్నారు.
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కోస్తాంధ్రలో హీట్ వెవ్ తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నాలుగు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని రామగుండం, ఆంధ్రప్రదేశ్లోని రెంటచింతల ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వాతావరణ హెచ్చరిక ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున, వృద్ధులు, చిన్నారులు ఎండలో తిరగొద్దని హెచ్చరిస్తున్నారు.