సారథి న్యూస్, హుస్నాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని
పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) జన్మించి జూన్ 28వ తేదీ నాటికి వందేళ్లు పూర్తి కావడంతో కుటుంబసభ్యులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామంలో 1921 జూన్28న ఆయన జన్మించారు. ఆయన తప్పటడుగుల వేసిన నుంచి యవ్వనం వరకు ఉన్న తన ఇంటినే మ్యూజియంగా చేయాలని పీవీ తనయుడు ప్రభాకర్ రావు సంకల్పించారు.
తాను 1952లో నిర్మించిన ఇంట్లో 100 ఏళ్ల జ్ఞాపకాలను పదిలపరిచేందుకు ఇంటిని సరికొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నారు. పీవీ రచించన పుస్తకాలు, కళ్లజోడు, వస్త్రాలు, విదేశాల్లో ప్రయాణించినప్పుడు దిగిన పలు ఫొటోలను ఢిల్లీ నుంచి తన నివాసానికి తీసుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు అనేక సంస్కరణలు తీసురావడమే కాకుండా ప్రపంచ దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టే విధంగా నూతన శకానికి రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి తమ ఊరినుంచి వెళ్లడం ఈ ప్రాంతానికే గర్వకారణమని పీవీ స్వగ్రామం నేటికి స్మరించుకుంటోంది. పీవీ శతజయంతి ఉత్సవాలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్, పీవీ కుటుంబసభ్యులు హాజరు కానున్నట్లు గ్రామస్తులు తెలిపారు.