టాలీవుడ్లో హీరో సత్య దేవ్ కి అభిమానులు ఎక్కువే. చేసిన సినిమాలు తక్కువే అయినా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు హీరో సత్యదేవ్. అయితే రీసెంట్గా గోపీ గణేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చూశారట. సినిమా నచ్చడంతో గోపీని, సత్యదేవుడిని ప్రత్యేకంగా ఇంటికి పిలిచి మాట్లాడారట. చిరంజీవిని కలిసి ముచ్చటించిన గోల్డెన్ మూమెంట్స్‌ను తను ఎప్పటికీ మరిచిపోలేనని, తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా తెలుపుతూ.. ‘చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచీ అభిమానం.. అసలు ఆయన వల్లనే సినిమాల్లోకి రావాలన్న కోరిక పుట్టింది.. నా చిన్నప్పుడు మా క్లాస్ రూం గోడ మీద ఒక పెద్ద స్కేల్ బొమ్మ ను అరడుగుల దాకా గీసి ఆపేశారు. రెండు, మూడు నెలలకొకసారి మమ్మల్ని ఎంత పొడవు పెరిగామో కొలిచేవారు. ఒకరోజు నేను మా టీచర్‌ను ‘మాలో ఎవరైనా ఆ సీలింగ్ కన్నా పొడవు పెరిగితే ఎలా టీచర్’ అని అడిగాను.
‘నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా?’ అన్నారు. ఆ తర్వాత చాలాసార్లు చాలాచోట్ల అదే మాట విన్నాను. కష్టతరం, అసాధ్యం అనిపించే పనులు చేయడానికి ఎవరు పూనుకున్నా చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు అనే మాటలు అవి. నేను సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు అదే ప్రశ్న ఎదురుపడింది. ‘నేను చిరంజీవి’ అనుకోలేదు. కొన్నికోట్ల మందిలాగా చిరంజీవి అవ్వాలనుకుంటున్నాను. నేను ఏమీ సాధించాను? ఎంత సాధించాను? అని కొలవడానికి నా లైఫ్ గోడ మీద నేను గీసుకున్న స్కేల్ చిరంజీవి. ఎవరెస్ట్ ఎక్కడానికి బయలుదేరిన ప్రతి ఒక్కడికీ అనుమానాలు, భయాలు తప్పవు. దారిలో ఊహించని అడ్డంకులు. కుంగదీసే గాయాలు. ‘ఇక నా వల్ల కాదు’ అని వెనక్కు తిరిగి పోవాలనుకున్నప్పుడు ఆ శిఖరం మీదున్న జెండా కనిపిస్తుంది. ఏదో తెలియని ధైర్యం వస్తుంది. శక్తిని పుంజుకుని మళ్లీ ప్రయాణం కొనసాగిస్తాం. తెలుగు సినిమాల్లోకి నటుడు అవ్వాలని వచ్చిన నాలాంటి వేల మందికి ‘చిరంజీవి’ అనే వ్యక్తి ఆ జెండా. మొన్న జూలై 8న చిరంజీవి గారిని వాళ్ల ఇంట్లో కలిశాను. ఆ క్షణాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. కలలాగానే ఉంది. ఆయన నాకు చెప్పిన ప్రతి మాటా గుర్తుంది. భద్రంగా నా మనసులో దాచుకుంటాను. ‘చిరంజీవి గారిని కలవడానికి వెళ్తున్నాను’ అని చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ల నుంచి అదే ప్రశ్న ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా’ అంట పదే పదే గుర్తు చేసుకుంటూ తన అభిమానాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశారు హీరో సత్యదేవ్.