వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై.. కమలా హారిస్ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్ తరఫున కమల ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పిన తేదీకి వ్యాక్సిన్ వచ్చినా.. దాని సేఫ్టీ విషయాన్ని నమ్మలేమన్నారు. మరోవైపు కరోనా కట్టడిలో ట్రంప్ ఘోరంగా ఫెయిల్ అయ్యారని డెమోక్రాట్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్ 1నాటికి వ్యాక్సిన్ తీసుకొస్తామని.. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే వైట్‌హౌస్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కమలా హారిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లను మభ్యపెట్టేందుకే ట్రంప్ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.