ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌వర్మ తన మూడో సినిమాకు ‘జాంబీరెడ్డి’అనే టైటిల్‌ను ఖరారుచేసి ఇటీవల చిత్ర పోస్టర్‌ను విడుదల చేశాడు. దీనిపై రెడ్డి సామాజిక వర్గం వారు మండిపడుతున్నారు. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ టైటిల్‌ను వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని.. అవసరమైతే కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని రెడ్డిసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రెడ్లకు సంబంధించిన సామాజికవర్గాల్లో దీనిపై విపరీతమైన చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘జాంబీరెడ్డి’ దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఓ ప్రకటన విడుదల చేశాడు.
‘ఇటీవల మా సినిమా టైటిల్ ‘జాంబీ రెడ్డి’ అని ప్రకటించాం. దానికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. టైటిల్ చాలా బాగుందంటూ చాలా కాల్స్, మెసేజ్‌స్ వచ్చాయి. మీమ్స్ కూడా వచ్చాయి. సినిమాకు అది యాప్ట్ టైటిల్. యానిమేషన్ చాలా బాగుందంటున్నారు. దానిపై మూడు నెలలకు పైగానే వర్క్ చేశాం. టీమ్ పడిన కష్టానికి వచ్చిన రిజల్ట్‌తో మేమంతా హ్యాపీగా ఉన్నాం. ఓ సామాజికవర్గం వారు టైటిల్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమాలో ఎవరినీ తక్కువ చేసి చూపించడం, ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని తక్కువ చేసి చూపించడం ఉండదు. ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్. దయచేసి టైటిల్‌ను తప్పుగా ఊహించుకోవద్దు. ఏ కులాన్నీ తక్కువచేసి చూపించడం అనేది కచ్చితంగా ఈ సినిమాలో ఉండదు’ అంటూ డైరెక్టర్ వివరణ ఇచ్చారు. కాగా ఈ వివాదం ఎటు పోతుందో ఇంకా తెలియడం లేదు.