Breaking News

కరోనా మిగిల్చిన కన్నీటి వ్యథలు

కరోనా మిగిల్చిన కన్నీటి వ్యథలు

ప్రపంచమంతా ఆధునికత వైపు ముందుకెళ్తుంటే.. కాయకష్టాన్ని నమ్ముకున్న వలస కూలీ మాత్రం ఓ పూట తిండి కోసం ఇప్పటికీ అల్లాడుతున్నాడు. ఇలాంటి కన్నీటి గాథలను కథలు కథలుగా వింటూనే ఉన్నాం. అయితే ఈ బక్కపల్చటి బతుకుల్లో అంతకుమించిన ఆవేదనను మిగిల్చింది కరోనా. మరీ ముఖ్యంగా మహిళలకు మనసు చెలించే కథలనే రాసింది. కాలం చేసిన గాయాల్లో ఎందరో ఆడ కూతుళ్ల కన్నీటి బొట్లకు ఇవి కొన్ని సాక్ష్యాలు మాత్రమే.


రూ.లక్షలు, రూ.కోట్లు సంపాదించాలని కలలో కూడా కోరుకోని మనుషులు వాళ్లు. రెండు పూటలా కడుపు నింపుకోవాలి.. ఊళ్లో ముసలి తల్లిదండ్రులు తినడానికి ఇంత పంపితే చాలనుకుంటారు. పుట్టిన ఊరు, సొంత రాష్ట్రంలో పని దొరక్క.. కూలీ పనులకోసం పొట్టచేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్తుంటారు. కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ ప్రకటించేసరికి.. చేతినిండా పనిలేక, తినడానికి తిండిలేక, సొంతూరు చేరేందుకు ప్రాణాలను సైతం ఫణంగాపెట్టి బయలుదేరారు. రవాణా సౌకర్యం లేక వలస కూలీలు వందలు, వేల కిలోమీటర్లు నడిచారు. దొరికిన ట్రక్కులు, లారీల్లో వెళ్లినవాళ్లు కొందరైతే.. దాతల సాయంతో ప్రైవేట్​ బస్సుల్లో ఇంకొంతమంది వెళ్లారు. కానీ ఆ ప్రయాణం మామూలుగా సాగలేదు. ముఖ్యంగా మహిళలు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి వలస కూలీలు తమ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, ఒడిశా, బీహార్​కు వెళ్లాలంటే మేడ్చల్ ఓఆర్ఆర్ (ఎన్​హెచ్​ 44) దాటాల్సిందే. అందుకే కొన్ని ఎన్జీవోలు, వలంటరీలు వలస కూలీలకు ఆహారం అందిస్తూ.. స్వచ్ఛందంగా ప్రైవేట్ బస్సులను ఏర్పాటుచేసి సొంతూళ్లకు పంపించారు. ఆ క్యాంపు వద్దకు వచ్చిన మహిళల్లో ఒక్కొక్కరిది ఒక్కో గోస ఇది.

రోడ్లపైన సేదదీరిన వలస కార్మికులు

బతికుండగానే బిడ్డల్ని కలుసుకోవాలని..
హైదరాబాద్ నుంచి ఝార్ఖండ్​కు బయలుదేరిన రాధాదేవిది బాధాకరమైన కథ. ఇక్కడ కూలీపనులు చేస్తే వచ్చిన డబ్బును నెలనెలా ఊరికి పంపితేనే సొంతూరులో ఉన్న ఇద్దరు బిడ్డలు కడుపుకింత తింటారు. లాక్​డౌన్​ కారణంగా చేసేందుకు పనులు దూరమయ్యాయి. దాంతో ఇక్కడి ఉండి లాభం లేదనుకుని సొంతూరు చేరాలనుకుంది. తన అక్క నీడలో బతుకుతున్న ఇద్దరు బిడ్డల చెంతకు చేరాలని మండే ఎండలను సైతం లెక్కచేయకుండా నడక మొదలుపెట్టింది. దారిలో ఎక్కడైనా తిండి దొరికితే తినడం, ఓపిక ఉన్నంత దూరం నడవడం, పగలు చెట్టు నీడన నిద్రపోయి, చీకటిపడుతుంటే మళ్లీ నడవడం.. ఇలా చేస్తూచేస్తూ చివరికి మేడ్చల్ క్యాంపునకు చేరింది. అక్కడినుంచి ప్రైవేట్​ బస్సులో సొంతూరుకు వెళ్లింది.
ఈ రాధాదేవిలాగే బిడ్డల మీద రందితో బయలుదేరింది సాగన్. ఊళ్లో ఉన్న కొడుకు, కూతురును ఆమె అత్త చూసుకుంటోంది. ఇక్కడ పనిలేదు.. పైగా బిడ్డలను చూడకుండానే ఇక్కడ కరోనాతో చస్తానేమోనన్న భయంతో బయలెల్లింది. రెండు నెలలుగా పనిలేదు. మూడురోజులు తిండిలేక పస్తులుంటున్నా సరే, బిడ్డలను చూడాలన్న ఆశతో మండుటెండలో నడుస్తూ చివరికి మేడ్చల్ వద్ద ఏర్పాటుచేసిన బస్సుల్లో సొంతూరుకు వెళ్లింది. బిడ్డలను చూడాలన్న ఈ ఇద్దరు తల్లుల ఆవేదన ముందు వాళ్లు పడిన ఆకలి బాధలు తక్కువే.

ఆడబిడ్డ పెళ్లికోసం
కీసర నుంచి బయలుదేరిన ఓ పెద్ద కుటుంబానిది మరో గాథ. వాళ్లు కీసర దగ్గర ఉన్న పౌల్ట్రీఫామ్​లో పనిచేయడానికి వలస వచ్చారు. వాళ్లది మధ్యప్రదేశ్​లోని ఝాన్సీ ప్రాంతం. అందులో టీనేజీ ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్నారు. వాళ్లంతా ఒక ఆడబిడ్డ పెండ్లి చేసేందుకు అవసరమయ్యే డబ్బు సంపాదన కోసం ఇంత దూరం వచ్చారు. పెండ్లి కొడుక్కి అపాచీ మోటార్​ సైకిల్​, నిఖా దావత్ ఘనంగా ఇవ్వాలట. అందువల్ల పెండ్లి కూతురు కూడా తన మేనమామ కుటుంబం, తోబుట్టువులతో కలిసి పని కోసం వచ్చింది. కానీ రెండు నెలలుగా ఆ ఫారమ్ యజమాని తిండి పెట్టక, జీతం ఇవ్వక నానాతిప్పలు పెట్టాడు. పెండ్లి సంగతి అటుంచి.. బతికితే చాలు అనుకుంటూ ఆ కుటుంబం ఖాళీచేతులు.. గుండెభారంతో సొంతగూటికి చేరింది

రోడ్డు మీదే కాన్పు
గందరగోళంగా సాగిన ఈ వలస కూలీల తిరుగు ప్రయాణంలో కన్నీళ్లు పెట్టించిన గాథలెన్నో. అందులో ప్రమీల(పేరు మార్చాం) కథ ఒకటి. మహారాష్ట్రకు వెళ్లాల్సిన ప్రమీలకు అప్పుడు 9వ నెల. అయినా సొంతూరు చేరాలన్న ఆశతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సులో బయలుదేరింది. ఆ బస్సులు జనాలను ఆదిలాబాద్​లో దింపేసి తిరిగొచ్చాయి. అయితే అక్కడి నుంచి ఆ రాష్ట్రం ఎలాంటి రవాణా సదుపాయం కల్పించక, కాలినడక వస్తున్న వాళ్లను అడ్డుకోవడంతో.. మరుసటిరోజే వాళ్లంతా మళ్లీ మేడ్చల్ ఓఆర్ఆర్​కు తిరిగొచ్చారు.
ఆదిలాబాద్​లో దిగగానే ప్రమీలకు నొప్పులు రావడంతో అక్కడే డెలివరీ అయింది. కేవలం ఆరుగంటలు అక్కడ విశ్రాంతి తీసుకుని, చేతిలో బిడ్డను పెట్టుకుని భర్తతో కలిసి మళ్లీ నడక ప్రారంభించింది. 70 కి.మీ. నడిచిన తర్వాత కొందరి దాతల సాయంతో కారులో సొంతూరుకు చేరారు ఆ తల్లీబిడ్డలు. ఒక మహిళకు ఇంతకన్నా నరకం ఉంటుందా? అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

బాలింతల బాధలు
పచ్చి బాలింత అయిన రూపాలి తన భర్త, మరో ఐదుగురితో కలిసి మేడ్చల్ క్యాంపునకు చేరింది. ఆమె చేతిలో 21 రోజుల పాప ఉంది. ఎంతో బలహీనంగా ఉన్న ఆ చిన్నారిని చూసిన ప్రతిఒక్కరి కళ్లలో నీళ్లు చెమర్చాయి. గజ్వేల్ వద్ద యాడారం నుంచి ఉదయం నాలుగు గంటలకు కాలినడకన బయలుదేరింది ఆ తల్లి. మేడ్చల్ క్యాంపు దగ్గరకు చేరేసరికి 11 గంటలైంది. వాళ్లది మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్​ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాంతం. ఈ రెండింటిలో ఎక్కడికి పంపినా వీళ్లు మళ్లీ 400 కి.మీ. ప్రయాణిస్తే కానీ ఇల్లు చేరలేరు. ఈ డైలమాలో ఉండగానే ఆ మహిళ.. ‘మమ్మల్ని ఆపకండి. మేం ఎలాగైనా ఊరికి వెళ్లాల్సిందే. నా బిడ్డను మా అమ్మానాన్నలకు, అత్తమామలకు చూపించాలి. ఇక్కడే ఉంటే చస్తామో.. బతుకుతామో అర్థం కావట్లేదు’ అంటూ మళ్లీ నడక ప్రారంభించింది. పౌష్టికాహారం తీసుకోవాల్సిన బాలింత రోజుల తరబడి పస్తులు ఉండడంతో పాలురాక బిడ్డకు పాలు సరిపడక.. చిన్నారి అనారోగ్యానికి గురైంది. చివరికి అక్కడున్న వలంటీర్లు ఆ కుటుంబం కోసం ప్రత్యేకంగా వెహికిల్​ను పెట్టి పంపించారు. అలాగే ఇంకో తల్లికి పాలు రాకపోవడంతో.. తల్లీబిడ్డలు ఎన్నోరోజులుగా పస్తులున్నారు. దాతల సాయంతో పాలపౌడర్ అందినా, దాన్ని వేడి నీళ్లలో కలపాలన్న ఉద్దేశంతో.. ఆ తల్లి చేసిన ప్రయత్నం మేడ్చల్ క్యాంపులో ఎంతోమందిని కంటతడి పెట్టించింది.

సొంత ప్రాంతాలకు వెళ్​తున్న కూలీలు(ఫైల్​)

ఆడదంటే.. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్
మేడ్చల్ ఓఆర్ఆర్ క్యాంపులో జరిగిన ఒక సంఘటన చాలామందిని కలచివేసింది. అదేమిటంటే.. అసలు సొంత ఊళ్లకు వెళ్తామా లేదా? ఇక్కడే కరోనా వచ్చి చస్తామా? లేక తిండీతిప్పలు అందక అనారోగ్యం పాలవుతామా? అన్న సందిగ్ధంలో అందరూ ఉంటే.. ఆ టైమ్లో, ఆ ప్రాంతంలో మందు ఎక్కడ దొరికిందో తెలీదు. కానీ ఒక వ్యక్తి బాగా తాగొచ్చి క్యాంపులోనే భార్యను కొట్టాడు. కరోనా, లాక్డౌన్, ఆకలి వంటి సమస్యలతో వచ్చిన ఫ్రస్ట్రేషన్ని తన భార్యపై చూపించాడు. ఇలాంటి సంఘటనల వల్ల ఎంతోమంది మహిళలు శారీరక హింసకు గురయ్యారు.

ఈ బాధల ముందు కరోనా ఎంత..?

హైదరాబాద్​ నుంచి సొంత ఊళ్లకు వెళ్తున్న వలస కూలీలు

ఇంట్లో ఉన్న గృహిణులు.. సెక్యూర్డ్ జాబ్​లో ఉన్న మహిళలే తరచూ శారీరక, మానసిక హింసకు గురవుతుంటారు. పైగా స్త్రీలు వివక్షతో పాటు రకరాల సమస్యలకు లోనవుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటాం. అలాంటిది ముందస్తు సమాచారం ఏమీలేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​.. వలస కూలీల జీవితాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఉన్నచోట ఉండలేక, సొంతూళ్లకు వెళ్లేందుకు వాహనాలు లేక నానాఅవస్థలు పడ్డారు. మరీ ముఖ్యంగా మహిళలు ఎదుర్కొన్న సమస్యలు అన్నీఇన్నీ కావు.
– భర్తకు చేదోడువాదోడుగా ఉండాలని ఒకరు.. ఒంటరి మహిళగా ఉంటూ పిల్లల్ని సాకడం కోసం ఒకరు.. మంచానపడ్డ అమ్మానాన్నలను కాపాడుకోవడం కోసం ఒకరు.. ఇలా ఎంతోమంది మహిళలు వలస కూలీలుగా మారారు. వాళ్లు ఈ లాక్డౌన్ కారణంగా సొంత ఊళ్లకు చేరిన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, హింసకు గురయ్యారు.
– రవాణా సౌకర్యం లేకపోవడంతో ముక్కూముఖం తెలియని మగవాళ్లతో కలిసి.. రాత్రనక పగలనక వందల మైళ్లు నడిచిన ప్రయాణంలోఎంతో మనోవేదనను అనుభవించారు మహిళలు. ముఖ్యంగా నెలసరి సమస్యతో ఉన్న మహిళలు అనుభవించిన బాధ వర్ణణాతీతం. అంతేకాదు, కనీసం బాత్రూమ్కి వెళ్లాలన్నా.. మరో కిలోమీటర్ దూరం నడిచిన ఆడపిల్లల అవస్థలు చెప్పడం కష్టం.
– బస్సులు, రైళ్లు ఆగిపోవడం (ప్రభుత్వం పెట్టిన శ్రామిక్ రైళ్ల సంగతి తెలియక, వాటిలో వెళ్లలేకపోయినవాళ్లు ఎంతోమంది)తో.. హైవేలపై కనిపించిన ట్రక్కు, లారీల్లో ఎంతోమంది పయనమైయ్యారు. నలభైమంది పట్టే వాహనంలో దాదాపు డెబ్భై, ఎనభైమంది ఎక్కారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే.. అంతమందిలో వయసొచ్చిన ఆడపిల్లలు, మహిళల సంఖ్య పది, ఇరవైలోపే. ఒక్కోదాంట్లో ఐదారుగురు కూడా ఉన్నారు. దానివల్ల వాళ్లు ఎన్నిరకాల సమస్యలను ఎదుర్కొన్నారో ఆ దేవుడికే తెలుసు.
– దారి మధ్యలో దాతలెవరైనా తిండి, నీళ్లు ఇస్తుంటే తీసుకోవడం.. లేదంటే కడుపు కాలుతున్నా నడక కొనసాగించడం.. ఇదే వలస కూలీలు కొన్ని రోజులపాటు చేసిన నిర్విరామ యుద్ధం. అలాగే ఈ ప్రయాణంలో మహిళలకు పీరియెడ్స్ పెద్ద సమస్యగా మారింది. ఆ సమయంలో తాము కట్టుకున్న చీరనే చింపి ఉపయోగించిన సంఘటనలను గమనించిన కొందరు వలంటీర్లు శానిటరీ ప్యాడ్స్​ను మహిళలకు అందించారు. కొందరు ఆడపిల్లలు నలుగురిలో వాటిని తీసుకోవడానికి ఇబ్బంది పడి వద్దన్నారట.
– నిండు గర్భిణి కాళ్లకు చెప్పులు లేకుండా నిప్పులు కక్కుతున్న రోడ్లపై రోజుల తరబడి నడవడం ఈ వలస కూలీల ప్రయాణంలో అందరం చూశాం. దారిలోనే ప్రసవించి.. పుట్టిన బిడ్డను చంకలో పెట్టుకుని మరీ పయనమైన తల్లులు ఎందరో.
– పచ్చి బాలింతలకు ఎలాంటి పోషకాహారం అవసరమో అందరికీ తెలుసు. ఆ తల్లీబిడ్డలకు ఆహారంతో పాటు విశ్రాంతి కూడా ముఖ్యం. కానీ ఇవేవీ ఆ తల్లీబిడ్డల విషయంలో జరగలేదు. తినడానికి తిండిలేక పస్తులున్న ఆ తల్లుల రొమ్ములు ఎండిపోయాయి. తల్లిపాలు సరిపోక బక్కచిక్కిన బిడ్డల ఆకలి మూగరోదనగా మిగిలిపోయింది.

వీలైనంత సాయం అందించాం

మేడ్చల్ మీదుగా చాలామంది వలస కూలీలు కాలినడకన ప్రయాణిస్తున్నారని తెలియగానే.. ఉమెన్ డెవలప్​మెంట్​ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్​ (మహిళా శిశుసంక్షేమశాఖ) కమిషనర్ దివ్యమేడమ్ వెంటనే స్పందించారు. ఫండ్స్ ఏర్పాటు చేసి మహిళలు, పిల్లలకు సెపరేట్​గా కిట్స్ తయారు చేయించారు. మా మేడ్చల్ పరిధిలోనే సుమారు ఏడువేల కిట్లను అందించాం. మహిళలకు ఇచ్చే కిట్స్​లో శానిటరీ ప్యాడ్స్, వాటర్ బాటిల్, హ్యాండ్ వాష్, శానిటైజర్, మాస్క్, బిస్కెట్స్​ వంటి అవసరమైన వస్తువులను పెట్టాం. పిల్లల కిట్స్​లో బిస్కెట్స్, పాలపౌడర్, వాటర్ బాటిల్, ఎనర్జీ బార్స్, స్నాక్స్ వంటివి ఏర్పాటుచేశాం. రెవెన్యూ, పోలీస్ డిపార్ట్​మెంట్​ కూడా వలస ప్రయాణం జరిగినన్ని రోజులు అక్కడ చాలా హెల్ప్ చేశారు. మాతో పాటు వందలమంది వలంటీర్స్ చేసిన కృషి చెప్పలేనిది. ఇలాంటి పరిస్థితి మరెప్పుడూ రావొద్దని కోరుకుంటున్నాను.
:: ఎన్. స్వరూపరాణి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, మేడ్చల్ జిల్లా

::: ఎన్​ఎన్​

One thought on “కరోనా మిగిల్చిన కన్నీటి వ్యథలు”

Comments are closed.