Breaking News

ఆశలు చిగురించే

సారథి న్యూస్, మెదక్: తొలకరి వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకతో మృగశిర కార్తె ఆరంభం నుంచే వానలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆశలు చిగురించాయి. సకాలంలో చినుకు పలకరించి నేలతల్లి మెత్తబడడంతో రైతులు వానాకాలం పంట సాగుకు ఉపక్రమించారు. దుక్కులు దున్నుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరి సాగు చేసే రైతులు నారుమళ్లు పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సొసైటీలు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద సందడి నెలకొంది.


2,60 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
వ్యవసాయ ప్రాధాన్యం కలిగిన మెతుకుసీమలో ఈ సారి 2,60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు ప్రణాళికలు తయారుచేశారు. కాగా, ప్రతిసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు పంటలు పూర్తిస్థాయిలో సాగు చేయలేకపోతున్నారు. అనువైన సమయంలో వానలు పడడం లేదు. దీంతో పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చెరువు, కుంటలు నిండితేనే లాభం
జిల్లాలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేవు. చిన్న నీటి వనరులైన చెరువులే రైతులకు పంటల సాగుకు ప్రధాన ఆదెరువు. జిల్లాలో ఏకైక మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన ఘనపూర్ ఆనకట్ట కింద 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఎగువన సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నిండితేనే ఘనపూర్ ఆనకట్ట కింద పంటల సాగుకు అవకాశం ఉంటుంది. ఇక వెల్దుర్తి మండలంలో ఉన్న చిన్నతరహా ప్రాజెక్ట్ అయిన హల్ది ప్రాజెక్ట్ కింద 2,900 ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లావ్యాప్తంగా నీటి పారుదలశాఖ పరిధిలో మొత్తం 2,681 చెరువులు ఉన్నాయి. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ఆయా సాగునీటి వనరులు పూర్తిస్థాయిలో నిండితేనే ఆయకట్టు సాగుచేసేందుకు వీలుపడుతుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ఇబ్బందులు తప్పవు.
పంటల సాగు వివరాలు
జిల్లాలో ఈ వానాకాలంలో మొత్తం 2.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పంటల వారీగా చూస్తే… అత్యధికంగా వరి 1,35 లక్షల ఎకరాలు, పత్తి 79వేల ఎకరాలు, కంది 25 వేలు, పెసర 10వేలు, జొన్న 4 వేలు, మినుము 3 వేలు, చెరుకు 1,500, ఇతర పంటలు మూడువేల ఎకరాల్లో సాగవుతాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.