సారథి న్యూస్, మెదక్: నామినేటెడ్ పదవులపై అధికార పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇటీవల కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ లకు కొత్త పాలకవర్గాల నియమించింది. దీంతో మెదక్ జిల్లాలో మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఆయ పదవుల కోసం జోరుగా లాబియింగ్ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో పలు నామినేటెడ్ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. గత పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయినప్పటికి కొత్త పాలక వర్గాల నియామకం జరగలేదు. పోస్టులు ఆశిస్తున్నవారు ప్రభుత్వం ఎప్పుడు భర్తీ చేస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలోని రెండు మార్కెట్ కమిటీ లతో పాటు మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజక వర్గ పరిధి చేగుంట మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో ప్రభుత్వం జిల్లాలో ఖాళీగా ఉన్న ఇతర మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ పదవులు కూడా భర్తీ చేస్తుందని ఆశావహులు భావిస్తున్నారు.
మెదక్ నియోజక వర్గంలో..
మెదక్, రామాయంపేట, పాపన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ, ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత దేవాలయ పాలక మండలి, హవేలీ ఘనపూర్ మండలం తోగుట రామస్వామి ఆలయ కమిటీ పాలక వర్గ పదవులు ఖాళీగా ఉన్నాయి.
నర్సాపూర్ నియోజకవర్గంలో ..
నర్సాపూర్ మార్కెట్ కమిటీ, కౌడిపల్లి మండలం తునికి నల్ల పోచమ్మ గుడి, శివ్వంపేట మండలం చాకరి మెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయం, సికిండ్లపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పాలక మండలి ఛైర్మెన్, డైరెక్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయి.
ఆశావహులు ఎక్కువే..
మార్కెట్ కమిటీ పాలక వర్గంలో చైర్మన్, వైస్ చైర్మన్ తోపాటు 10 మంది డైరెక్టర్లు ఉంటారు. దేవాలయ పాలక మండలిలో చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు ఉంటారు. గతంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, సొసైటీ చైర్మెన్ పదవులు ఆశించి రిజర్వేషన్ ల కారణంగా అవకాశం దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, ఇదివరకు పార్టీ పదవులు నిర్వర్తించిన వారు ఇపుడు మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ పాలకవర్గ ఛైర్మెన్, డైరెక్టర్ పదవులు ఆశిస్తున్నారు. నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. కానీ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే ఆయా పదవులు దక్కుతాయి. ఈ మేరకు ఆయ పదవులు ఆశిస్తున్న అధికార పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేల ఆశీస్సులతో నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా పోటీ ఎక్కువగా ఉండటంతో ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఎవరికి చైర్మన్, డైరెక్టర్ పదవులు దక్కుతాయనే దానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
- July 9, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AGRICULTURE
- HYDERABAD
- LEADERS
- medak
- TRS
- ఆలయకమిటీ
- నామినేటెడ్
- మార్కెట్ కమిటీ
- Comments Off on ఆశల పల్లకిలో నేతలు