- శ్రీశైలం పవర్ హౌస్ మంటల్లో చిక్కుకుని మృత్యువాత
- తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్
- సీఐడీ విచారణకు ఆదేశాలు
సారథి న్యూస్, అచ్చంపేట: ఎటుచూసినా చిమ్మ చీకటి.. చుట్టూ దట్టమైన పొగలు.. ఎక్కడ చిక్కిన వారంతా అక్కడే ప్రాణాలు విడిచారు. తెలంగాణ పరిధిలోని పాతాళగంగ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 9మంది దుర్మరణం పాలయ్యారు. ఒకరు డీఈ, నలుగురు ఏఈ స్థాయి అధికారులు ఉన్నారు. మిగతావారు సిబ్బంది ఉన్నారు. జెన్కో మొదటి యూనిట్‌లోని ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 17 మంది విధుల్లో ఉన్నారు. హుటాహుటిన 8 మందిని రెస్క్యూ టీం కాపాడగలిగింది. మంటలు వ్యాపించడం, పొగలు కమ్ముకోవడంతో మిగతావారిని బయటికి తీసుకురావడం సాధ్యంకాలేదు. దీంతో మిగతా 9 మంది పొగలో ఊపిరాడక ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచినట్టు సంబంధిత అధికారులు ప్రకటించారు. గాయపడిన జెన్కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతులు వీరే
శ్రీనివాస్ గౌడ్ డీఈ, హైదరాబాద్, వెంకట్రావు ఏఈ, పాల్వంచ, మోహన్ కుమార్ ఏఈ, హైదరాబాద్, ఉజ్మ ఫాతిమా ఏఈ, హైదరాబాద్, సుందర్ ఏఈ, సూర్యాపేట, రాంబాబు ప్లాంట్ అటెండెంట్, ఖమ్మం జిల్లా, కిరణ్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్, పాల్వంచ, వినేష్‌కుమార్ సిబ్బంది, మహేశ్‌కుమార్ అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది మృతిచెందారు.
సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్: శ్రీశైలం జెన్కో పవర్‌హౌస్‌లో జరిగిన ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరగడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో వైద్య చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సంఘటన స్థలంలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సీఐడీ విచారణకు సీఎం ఆదేశం
శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాద ఘటనపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికితీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సీఎం స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.