- మనువాదుల పార్టీ నుంచి బయటికొచ్చి మాట్లాడు
- నాగర్ కర్నూల్ గడ్డ.. మహేంద్రనాథ్ అడ్డా
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్
సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మరాజుపై బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జలాల్ శివుడు చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పకపోతే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ హెచ్చరించారు. ధర్మం తప్పితే మీలాంటి వారికి యమధర్మరాజే అవుతారని హితవు పలికారు. ఉద్యమకారుడిగా ధర్మరాజు చేసిన ఆత్మగౌరవాల పోరాటాల ముందు నువ్వెంత? అని ప్రశ్నించారు. సోమవారం నాగర్ కర్నూల్ లో దళితసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపై తీవ్రవిమర్శలు చేశారు. నాగర్ కర్నూల్ గడ్డ మహేంద్రనాథ్ అడ్డా అని, ఇక్కడ దళితులు చైతన్యవంతులై ఎన్నో పోరాటాలు చేశారని, వారికి గురువుగా ధర్మరాజు ముందుండి నడిపించారని గుర్తుచేశారు. వాటిని తెలుసుకోకుండా ఆ ధర్మరాజు అని కించపరిచే విధంగా మాట్లాడిన తీరు నీ అజ్ఞానాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. మతవాదుల పార్టీలో ఉండి ఎస్సీ సెల్ అని తోక పెట్టుకుని దళితులను కించపరుస్తున్న జలాల్శివుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇక్కడి దళితుల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.
మతవాదుల పార్టీలో ఉండి నువ్వేంది మాట్లాడేది?
తెలంగాణ ఉద్యమం సమయంలో ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు ధర్మరాజు ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. జలాల్ శివుడికి ఆయనను ప్రొడక్షన్ చేసే క్రిమినల్ మైండ్ గల దిలీపాచారికి ఆత్మగౌరవం గురించి, అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆకలి చావులు, అన్నివర్గాల ప్రజల గురించి, వారిపైన దాడులు జరిగితే జెట్టి ధర్మరాజు అండగా నిలబడిన వ్యక్తి అని గుర్తుచేశారు. దమ్మూధైర్యం ఉంటే దిలీపాచారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, జిల్లా, రాష్ట్ర నాయకులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జెట్టి ధర్మరాజును విమర్శించాలని హితవు పలికారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దళితులపై దాడులు జరిగిన వెంటనే స్పందించి వారి పక్షాన ప్రభుత్వంతో పోరాటం చేసి వారికి న్యాయం జరిగే వరకు ముందుండే వ్యక్తి ధర్మరాజు అని కితాబిచ్చారు. మతవాదుల పార్టీలో ఉండి ఆరోపణలు చేసిన నీవు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ లక్షలాది అంబేద్కర్, పూలేవాదులు ఉన్నారని, వేలాది అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, మథర్ థెరిస్సా లాంటి మార్గదర్శి అని కొనియాడారు. సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర నాయకుడు జెట్టి చిన్న వెంకటేశ్, ఎరుకల సంఘం నాయకుడు కూరాకుల శ్రీనివాసులు, ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు జిలకర బాలస్వామి, తెలంగాణ మాదిగ దండోరా నాయకులు మంతటి గోపి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్ము మోహన్, శివకుమార్, ఏసయ్య, శంకర్, రఘు, జగదీశ్, రామకృష్ణ పాల్గొన్నారు.