- ఇండస్ట్రీ సమస్యలపై సీఎంతో చర్చించాం
- పరిశ్రమల వ్యక్తులు మీడియోతో మాట్లాడొద్దు
- మెగాస్టార్ చిరంజీవి
అమరావతి : సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిష్కారం దక్కే సూచనలు ఉన్నాయని, పది రోజుల్లో సినీ పరిశ్రమకు శుభవార్త వస్తుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గురువారం ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ సమస్యకు పరిష్కారం దక్కగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఒక పక్షానే ఉండను, అందరినీ సమ దృష్టితో చూస్తాను.అందరికీ ఆమోదయోగ్యమైన విధివిధానాలను తీసుకుంటాను. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సీఎం జగన్ భరోసా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకే గురువారం ఆయనతో భేటీ అయ్యానని, ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విభాగాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం వేసిన కమిటీతోనూ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని, జీవో 35పై పునరాలోచిస్తామని సీఎం చెప్పినట్లు చిరంజీవి వెల్లడించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పరిశ్రమ వ్యక్తులు ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని సూచించారు. తాను ఇండస్ట్రీ పెద్దగా రాలేదని, ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలోని అందరితో చర్చించి, మళ్లీ ఇంకోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతానని చిరంజీవి వివరించారు.