Breaking News

విద్యావలంటీర్లకు అండగా ఉంటాం

విద్యావలంటీర్లకు అండగా ఉంటాం

బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు

సారథి, కొల్లాపూర్: రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడ్డ విద్యా వలంటీర్లకు అండగా ఉంటామని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు భరోసా ఇచ్చారు. నాగ్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో గురువారం జరిగిన ‘దగాపడ్డ విద్యావలంటీర్లకు చేయూత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో వారి బతుకులు చితికిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. అభివృద్ధి కోసమే పార్టీలు మారినం అని చెప్పుకునే ప్రజాప్రతినిధులకు విద్యావలంటీర్ల కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మానవతా దృక్పథంతో కరోనా కాలంలో నెలనెలా ఆర్థిక సాయం చేస్తానని ఎల్లేని హామీఇచ్చారు. ఈ ప్రకటనపై విద్యావలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టాలు అర్థం చేసుకుని సాయం చేస్తున్న సుధాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యావలంటీర్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి సంవత్సరం రెన్యవల్ చేయాలని, డీఎస్సీలో 20శాతం కోటా కేటాయించాలని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా గుర్తించాలని, గత 14 నెలల వేతనం వెంటనే చెల్లించాలనే తదితర డిమాండ్లతో కొల్లాపూర్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీమోర్చా కార్యదర్శి జలాల్ శివుడు, బీజేపీ జిల్లా నాయకులు, పలు మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, విద్యావలంటీర్ల సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.