Breaking News

దమ్ముంటే బాసర త్రిబుల్ ​ఐటీకి రా!

దమ్ముంటే బాసర త్రిబుల్​ఐటీకి రా!

  • చేతనైతే యూనివర్సిటీలు, ఆస్పత్రులు, మేధావులతో సర్వేచేయించు
  • బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ సవాల్​
  • తెలంగాణ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్​ చేయాలి
  • ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ తో మిలాఖత్ అవుతున్నాయని ఫైర్​

సామాజికసారథి, నిజామాబాద్ ప్రతినిధి : కేసీఆర్​ ప్రభుత్వం ఓడిపోయే స్థితిలో ఎగ్జిట్ మోడ్ లో ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ ​విమర్శించారు. అందుకే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు, విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఎద్దేవాచేశారు. సర్వేలతో బిజీగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేతనైతే యూనివర్సిటీలు, ఆస్పత్రులు, ప్రభుత్వరంగ సంస్థల్లో మేధావులతో సర్వేచేయించాలని సూచించారు. సర్వేలను నమ్మి తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దని కోరారు. సర్వేలను నమ్ముకుంటే కేసీఆర్ కు రాబోయే కాలంలో దిమ్మతిరగడం ఖాయమన్నారు. కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురైన బాసర త్రిబుల్​ఐటీ విద్యార్థులను నిజామాబాద్ లోని ఆస్పత్రిలో శనివారం ఆయన పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి వారి యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్ ​కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు 15రోజుల పాటు ధర్నా చేసి సీఎం కేసీఆర్ ​తమ యూనివర్సిటీకి రావాలని, ఫుడ్ కాంట్రాక్టర్ ను తొలగించాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోకుండా కంటితుడుపు చర్యగా కేవలం డైరెక్టర్ గా నియమించి వదిలేసిందన్నారు. ప్రభుత్వ తప్పిదంతో ఇప్పుడు విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షపార్టీలు కూడా కేసీఆర్ తో మిలాఖత్ అవుతున్నాయని, అందుకే చిత్తశుద్ధితో పేదల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఎస్పీ పార్టీ ఒక్కటే ప్రజాసమస్యలపై పోరాడుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు. వారి కుటుంబాలు బాగుంటే చాలని కోరుకుంటున్నారని విమర్శించారు.

విద్యార్థులను పరామర్శిస్తున్న డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
టీఆర్ఎస్​ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల భవిష్యత్, యోగక్షేమాలు అవసరం లేదని, కేవలం కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఉంటే చాలని ఎద్దేవాచేశారు. ప్రజల యోగక్షేమాలను పట్టించుకోని ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదింపాలని కోరారు. కేసీఆర్​కు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. 70 వేల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రికి ప్రజలకు ఏంచేయాలో తెలియడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్​కు విద్యార్థులంటే ఎందుకింత కోపమని ప్రశ్నించారు. బాసర యూనివర్సిటీలో మెస్ ల చుట్టూ అపరిశుభ్రంగా ఉందని, డేట్ దాటిపోయిన వస్తువులను వాడటం వల్లే ఆహారం కలుషితమైందని తెలిపారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కలవకుండా పోలీసులతో బందోబస్తు పెట్టారని మండిపడ్డారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో పూర్తి విచారణ జరిపి, అందుకు కారణమైన ఫుడ్ కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ ​చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.20 కోట్లు ఇస్తామని ప్రకటించి రూ.20 కూడా ఇవ్వని అబద్ధాల ప్రభుత్వాన్ని గద్దెదించాలని డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ పిలుపునిచ్చారు.

పేదలకు ఉచితంగా విద్య, వైద్యం
విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే బహుజన రాజ్యం రావాలని అన్నారు. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని కోరారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కాగా, విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన బీఎస్పీ నాయకులు, కార్యకర్తలను ఆస్పత్రి లోపలికి వెళ్లకుండా ఆపడంతో పోలీసులు, బీఎస్పీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొన్నది. బీఎస్పీ నాయకులు పోలీసుల తీరును ఖండిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.