సారథి న్యూస్, హైదరాబాద్: పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్‌చేశారు. ధరలు తగ్గే వరకు పేదల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. చదువుకున్న మేథావులంతా పెరుగుతున్న ధరలపై ఆలోచన చేయాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాంపల్లి గృహకల్ప వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే సీతక్క, అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో కంటే ఎన్డీయే హయాంలో ధరలు మూడు రెట్లు అధికమయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని మోడీ సర్కార్, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
పేదలనడ్డి విరుస్తున్నారు..
అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. నిత్యవసర ధరలను వంద రోజుల్లో తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు. కరోనా వచ్చి దేశమంతా కష్టకాలంలో ఉంటే పన్నుల పేరుతో సామాన్యులపై ఇలా భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మేమిద్దం.. మాకిద్దరు! అనే చందంగా అదానీ, అంబానీలకు మోడీ, అమిత్‌షా దేశ సంపదను దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని మహిళామణులందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని అభయమిచ్చారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ మాట్లాడుతూ.. బడ్జెట్ సమయంలో అచ్చేదిన్ వచ్చిదంటూ నిర్మలాసీతారామన్ ప్రగల్భాలు పలికారని, కానీ నేడు అచ్చేదిన్ ఏమోగాని సామాన్యులకు మాత్రం సచ్చేదిన్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ జోత్స్న, అధికార ప్రతినిధులు సునీతారావు, సంధ్యారెడ్డి, రవళి, కార్యదర్శులు కల్పన, ప్రేమలత అగర్వాల్, పద్మ, రేణుకా, హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అచ్యుత, రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుజాత, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- March 2, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- BJP
- CONGRESSS
- TPCC
- UTTAMKUMAR
- ఉత్తమ్‌కుమార్
- కాంగ్రెస్
- టీపీసీసీ
- బీజేపీ
- Comments Off on కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలే