సామాజిక సారథి, జోగుళాంబ గద్వాల: రైతులను మించిన శాస్త్రవేత్తలు ఎవరు లేరని నటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. వారికి ఏ భూమిలో ఏ పంట వేయాలో..ఎప్పుడు వేయాలో బాగా తెలుసని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చట్టాల వల్ల ప్రజలకు జరిగే నష్టం గురించి రైతన్న సినిమాలో వివరించామని, ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూసి ఆదరించాలని కోరారు. వ్యవసాయం దండగ కాదని పండుగని చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని చెప్పారు. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలుచేస్తే రైతులకు 50 శాతం లాభం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు వెంకటస్వామి, మధుసూదన్ బాబు, ఇక్బాల్ పాషా ప్రభాకర్, ఆలూరు ప్రకాష్ గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
- December 10, 2021
- Archive
- Top News
- నల్లగొండ
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- సినిమా
- Comments Off on రైతును మించిన శాస్త్రవేత్త లేడు